: 13 నెలలైనా పాడుకాని శవం...వైద్య శాస్త్రంలో సరికొత్త ఆవిష్కరణ

మరణించిన తరువాత మళ్లీ వస్తారని, అలాంటప్పుడు వారికి శరీరం అవసరమవుతుందనే నమ్మకంతో ఈజిప్టు రాజవంశీకులు మరణించిన వారి శవాలను చెడిపోకుండా భద్రపరిచేవారు. అయినప్పటికీ వారి శరీరాలు మట్టిలో కలిసిపోయేవి. అలాంటి మమ్మీలను పరిశోధకులు పలు సందర్భాల్లో కనుగొనడం జరిగింది. అయితే తాజాగా అలా మట్టిలో కలిసిపోకుండా, మరణించినా శరీరం ఏమాత్రం పాడుకాకుండా ఉండే పద్ధతిని పెరూ దేశానికి చెందిన డాక్టర్ ఎడ్గార్ అరంద కనుగొన్నారు. తన సోదరుడు మరణించి 13 నెలలైనా అతని శరీరం పాడుకాకుండా కాపాడారు. మరణించినప్పుడు తన సోదరుడు ఎలా ఉన్నారో, 13 నెలలు ముగిసిన తరువాత కూడా అలాగే ఉన్నారని ఆయన తెలిపారు. మరణించిన తన సోదరుడి శరీరం నుంచి రక్తాన్ని పూర్తిగా తీసివేసి, దానికి కొన్ని ప్రత్యేక రసాయనాలు కలిపి శరీరంలోకి తిరిగి ఎక్కించారు. తాను చేసిన ఈ ప్రయోగాన్ని ఆయన తన బంధువుల ఎదుట ప్రదర్శించారు. ఈ వీడియోను విడుదల చేశారు. అయితే తాను చేసిన ఈ రసాయనాల మిశ్రమం ఫార్ములాను వెల్లడించనని, భారీ ఎత్తున శవాలను భద్రపరిచిన అనంతరం ఫార్ములా బయటపెడతానని ఆయన చెప్పారు. తన సోదరుడు బతికి ఉండగా, 'అన్నయ్యా నీకు సహాయం చేయలేకపోతున్నా'నని బాధపడేవాడని, మరణించాక ఇలా సహాయపడి రుణం తీర్చుకున్నాడని ఆయన తెలిపారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పెట్టగా, శవాలను భద్రపరచాల్సిన అవసరం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.

More Telugu News