: టీటీడీలో సగం అక్రమాలు ప్రజా ప్రతినిధులు, పాలకమండలి సభ్యుల వల్లే... ఎలాగంటే!

తిరుమల శ్రీవెంకటేశ్వరుని దర్శించుకోవాలని, మనసారా ఆయనకు ఏదైనా సేవ చేసుకోవాలని పరితపించే వారు లక్షల సంఖ్యలో ఉంటారు. దర్శనం విషయం పక్కనబెడితే, వివిధ రకాల సేవలకు సంబంధించి టీటీడీలో ఎన్నో అక్రమాలు గతంలో వెలుగు చూశాయి. ఇప్పుడు చూస్తున్నాయి కూడా. గడచిన నాలుగైదు నెలల్లో అభిషేకం, సుప్రభాతం, తోమాల సేవ, కల్యాణోత్సవం వంటి ప్రధాన సేవలకు సంబంధించిన టికెట్ల జారీలో పలు అక్రమాలను టీటీడీ నిఘా విభాగం గుర్తించింది. ఎంత పకడ్బందీ చర్యలు తీసుకున్నా అక్రమార్కులు ఆగక పోవడానికి కారణం ప్రజా ప్రతినిధులు, పాలక మండలి సభ్యులేనని గమనించిన నిఘా అధికారులు అవాక్కయ్యారు. అది ఎలాగంటే... వాస్తవానికి నిత్యమూ జరిగే స్వామివారి సేవలకు సంబంధించి ఆన్ లైన్ కోటా, కరెంట్ బుకింగ్ తో పాటు సిఫార్సు లేఖలపై టికెట్లను టీటీడీ జారీ చేస్తుంది. ప్రతి ప్రజా ప్రతినిధికి వారి స్థాయిని బట్టి సిఫార్సు లేఖల కోటా ఉంటుంది. ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు రోజుకు ఒకటి, ఎంపీలు, మంత్రులకు, కేంద్ర మంత్రులకు ఎంచుకునే సేవను బట్టి రెండు నుంచి ఐదు, పాలక మండలి సభ్యులకు పది వరకూ సిఫార్సులు ఇచ్చే సదుపాయం ఉంది. ఇదే అక్రమార్కులకు వరమైంది. సాధారణ పరిస్థితుల్లో తిరుమలకు వచ్చే వ్యక్తుల పేర్లు, వారికి కావాల్సిన సేవ, వసతి సదుపాయం వివరాలతో నిండిన సిఫార్సు లేఖలపై సంతకాలు పెట్టాల్సిన వారు, ఖాళీ కాగితాలపై సంతకాలు పెట్టి అనుచరులకు ఇచ్చేస్తున్నారు. వీటిని కొండపై వున్న అక్రమార్కులకు అమ్ముతుండటంతో, వారు సమయం, డిమాండ్ ను బట్టి సిఫార్సు లేఖల కోసం వేలు, లక్షలు వెచ్చించే ధనిక కుటుంబాలు, ఇతర రాష్ట్రాల వారికి విక్రయిస్తూ దండుకుంటున్నారు. గత రెండు నెలల వ్యవధిలో ఈ తరహా అక్రమాలకు సంబంధించి పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. సుప్రభాతం, అర్చన, తోమాల సేవలకు, దీంతో పాటు ఎల్-1 వీఐపీ సిఫార్సు లేఖలకు డిమాండ్ ఉందని తెలుస్తోంది. ఇటీవల ఓ వ్యక్తి రూ. 500 విలువైన ఎల్-1 సిఫార్సు లేఖను రూ. 10 వేలకు విక్రయిస్తూ పట్టుబడగా, ఓ ప్రముఖుడు ఐదు సుప్రభాత టికెట్ల కోసం సిఫార్సు చేస్తే దానికి మరో రెండు టికెట్లు కావాలని జతపరుస్తూ, వాటిని రూ. 46 వేలకు విక్రయిస్తూ మరో దళారీ పట్టుబడ్డాడు. దీంతో తిరుమల నిఘా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. త్వరలోనే నిబంధనలు మార్చుతామని, ప్రజాప్రతినిధులు ఖాళీ కాగితాలపై సంతకాలు చేయరాదని సలహాలు ఇచ్చారు. రాజకీయ నాయకులు తాము సిఫార్సు చేస్తున్న వారి వివరాలు ఎస్ఎంఎస్ రూపంలో ఇచ్చేలా సరికొత్త సాఫ్ట్ వేర్ ను అభివృద్ధి చేయనున్నట్టు ఈఓ సాంబశివరావు వెల్లడించారు. ఇకనైనా ఈ అక్రమ దందాకు అడ్డుకట్ట పడుతుందేమో చూడాలి.

More Telugu News