: నాడు కాంబ్లీ కన్నీరు కార్చాడు, నేడు ఎవరూ ఆ పని చేయలేదు... అంతే తేడా, మిగతాదంతా సేమ్ టూ సేమ్!

కటక్ లోని బారాబతి స్టేడియంలో నిన్న జరిగిన క్రికెట్ అభిమానుల రభస 1996 నాటి వరల్డ్ కప్ లో భాగంగా కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో శ్రీలంకతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ ని గుర్తుకు తెచ్చింది. భారత ఓటమిని ఊహించని అభిమానులు ఆనాడు స్టేడియంలో రణరంగం సృష్టించారు. అందుబాటులో ఉన్న వస్తువులన్నీ స్టేడియంలో విసిరారు. మ్యాచ్ అర్థాంతరంగా ఆగిపోగా, క్రీజులో ఉన్న వినోద్ కాంబ్లీ కన్నీటితో మైదానాన్ని దాటాల్సి వచ్చింది. సరిగ్గా 19 సంవత్సరాల తరువాత అటువంటి ఘటనే కటక్ లో జరిగింది. టీ-20 మ్యాచ్ లో ధోనీ సేన ఓటమి బాటన పరుగెత్తుతుండటాన్ని చూసి తట్టుకోలేని అభిమానులు అదే తరహాలో స్పందించారు. చేతిలో వాటర్ బాటిళ్లు మినహా మరేమీ లేకపోవడంతో వాటితోనే విధ్వంసం సృష్టించి మ్యాచ్ కి మూడుసార్లు అంతరాయం కలిగించారు. ఆనాడు వినోద్ కాంబ్లీ కన్నీరు కార్చగా, నేడు ఆ పని చేసేందుకు ఎవరూ లేకపోయారని సామాజిక మాధ్యమాల్లో పలువురు ట్వీట్లు చేశారు. కేవలం కన్నీరు మినహా మిగతా అంతా ఆనాటి ఈడెన్ గార్డెన్స్ ను గుర్తుకు తెచ్చిందని వ్యాఖ్యానించారు. అప్పటి మ్యాచ్ కి, ఇప్పటి మ్యాచ్ కి తేడా వినోద్ కాంబ్లీ లేకపోవడమేనని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. భారత అభిమానుల చర్యలపై ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. అప్పటికీ, ఇప్పటికీ అభిమానుల మైండ్ సెట్ మారలేదని భారత ఓటమిని జీర్ణించుకునే వారి సంఖ్యా మారలేదని ట్వీట్లు చేశారు.

More Telugu News