: మన 'సింహం' దూకుతోంది: మోదీ

'మేకిన్ ఇండియా'లో భాగంగా భారత్ చేపట్టిన సంస్కరణలు ఫలితాలను అందిస్తున్నాయని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. ఈ ఉదయం జర్మనీ చాన్స్ లర్ మెర్కెల్ తో కలసి బెంగళూరులోని బాష్ ఇంజనీరింగ్ కళాశాలకు వెళ్లిన మోదీ అక్కడ ఉద్యోగులు, విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. మేకిన్ ఇండియా చిహ్నంగా సింహాన్ని ఎంచుకున్నామని, ఇప్పుడా సింహం గర్జిస్తూ, ముందుకు దూకుతోందని అన్నారు. మాన్యుఫాక్చరింగ్, ఐటీ రంగాల్లో నూతన ఆవిష్కరణలను గురించి అక్కడి ఉన్నతోద్యోగులను అడిగి తెలుసుకున్న ఆయన, విదేశీ పెట్టుబడులను ఆహ్వానిస్తూ, ఎన్టీయే ప్రభుత్వం తీసుకున్న చర్యలను గురించి వివరించారు. పన్ను విధానాలను పూర్తి పారదర్శకంగా మార్చామని ఆయన అన్నారు. అన్ని రాష్ట్రాల్లో ఒకే విధమైన పన్ను వసూలు అమలు చేసే లక్ష్యంగా జీఎస్టీ బిల్లును తీసుకురానున్నామని తెలియజేశారు. భారత జీడీపీ వృద్ధి రేటు సైతం ఏడు శాతానికి పైగా ఉందని, ఎఫ్డీఐ సైతం గత సంవత్సరంతో పోలిస్తే 14 శాతం పెరిగిందని గుర్తు చేశారు. వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్ వంటి సంస్థలు ఇండియాలో వృద్ధి రేటు మరింత వేగవంతమవుతుందని అంచనా వేశాయని తెలిపారు. పరిశ్రమలు స్థాపించేందుకు వస్తున్న వారికి వేగంగా అనుమతులు మంజూరు చేస్తున్నామని, రక్షణ రంగంలో 49 శాతం విదేశీ పెట్టుబడులకు ఆమోదం పలికామని మోదీ అన్నారు. రైల్వేల్లో వందశాతం ఎఫ్డీఐకి స్వాగతం పలుకుతున్నామని పేర్కొన్నారు. ప్రైవేటు సంస్థలతో కలసి ప్రభుత్వం పలు ప్రాజెక్టులను ఇప్పటికే పూర్తి చేసిందని, భవిష్యత్తులో మరిన్ని ప్రాజెక్టులను ఇదే విధానంలో చేపడతామని అన్నారు. ఇండియా అమలు చేస్తున్న ఐపీఆర్ (ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్) పాలసీ ఔత్సాహికులకు ఎంతో మేలు కలిగిస్తుందని తెలిపారు. ఇండియాలో యువత సంఖ్య అధికంగా ఉందని, వీరిలో నైపుణ్యానికి కొదవలేదని నరేంద్ర మోదీ అన్నారు. వీరిని ఎంటర్ ప్రెన్యూర్లుగా మార్చి వారికి అవసరమయ్యే పెట్టుబడులను అందించడం ద్వారా తదుపరి తరం వృద్ధి దిశగా ఇండియా అడుగేయనుందని వివరించారు. దేశాభివృద్ధిలో జర్మనీ పెట్టుబడిదారులు భాగస్వామ్యం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపిన ఆయన, భారత్ అందిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని కోరారు.

More Telugu News