: వెనుదిరిగి చూడని స్టాక్ మార్కెట్... హైజంప్!

సెషన్ ఆరంభంలోనే క్రితం ముగింపుతో పోలిస్తే 280 పాయింట్లకు పైగా లాభంలో ఉన్న సెన్సెక్స్ మరే దశలోనూ వెనుదిరిగి చూడలేదు. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు, దేశవాళీ ఫండ్ సంస్థలు భారీగా కొనుగోళ్లు జరపడంతో సెన్సెక్స్ బుల్ హైజంప్ చేసింది. ఇటీవలి కాలంలో ఎన్నడూ చూడని ర్యాలీ నమోదు కాగా నిఫ్టీ సూచిక అత్యంత కీలకమైన 8,100 పాయింట్ల స్థాయిని దాటింది. సోమవారం నాటి సెషన్ ముగిసేసరికి బీఎస్ఈ సెన్సెక్స్ 564.60 పాయింట్లు పెరిగి 2.15 శాతం లాభంతో 26,785.55 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ సూచిక 168.40 పాయింట్లు పెరిగి 2.12 శాతం లాభంతో 8,119.30 పాయింట్ల వద్దకు చేరాయి. శుక్రవారం నాటి సెషన్లో రూ. 96,54,692 కోట్లుగా ఉన్న మార్కెట్ కాప్, రూ. 98,39,357 కోట్లకు పెరిగింది. బీఎస్ఈలో మిడ్ క్యాప్ 1.79 శాతం, స్మాల్ క్యాప్ 1.62 శాతం లాభపడ్డాయి. ఎన్ఎస్ఈ-50లో టాటా స్టీల్, టాటా మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్, బోష్ లిమిటెడ్, హెచ్డీఎఫ్సీ తదితర కంపెనీల ఈక్విటీలు లాభపడ్డాయి. ఇదే సమయంలో మారుతి సుజుకి, డాక్టర్ రెడ్డీస్, లూపిన్, హిందుస్థాన్ యూనీలివర్, విప్రో తదితర కంపెనీల ఈక్విటీలు నష్టపోయాయి.

More Telugu News