: సెకండ్ హ్యాండ్ స్మార్ట్ ఫోన్ కొంటున్నారా? అయితే, వీటిని గమనించండి!

రోజుకో రకం కొత్త ఫోన్లు మార్కెట్లను ముంచుతున్న వేళ, తమ వద్ద ఉన్నవాటిని అమ్మేసి కొత్త ఫోన్లు కొనాలని భావిస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇదే సమయంలో వాటిని కొనాలని భావిస్తున్న వారూ అధికంగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో సెకండ్ హ్యాండ్ స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేసే ముందు గుర్తించాల్సిన ముఖ్య విషయాలను ఒకసారి పరిశీలిస్తే... బిల్లు, బాక్సు యాక్సెసరీలు: వాడేసిన ఫోన్ కొనుగోలు చేసే ముందు అది దొంగిలించబడినది కాదన్న నమ్మకం రావాలంటే, దాని బిల్లు, బాక్సు, దానిలో లభించే యాక్సెసరీస్ సరిచూసుకోవాలి. అప్పుడే దాన్ని ఇంకొకరికి మీరు అమ్మాలన్నా, రిపేర్ వచ్చి రీప్లేస్ చేసుకోవాలన్నా సులువవుతుంది. (యాపిల్ ఐఫోన్-5 వచ్చిన రెండేళ్ల తరువాత, చిన్న లోపం కారణంగా అన్ని ఫోన్లనూ ఆ సంస్థ రీప్లేస్ చేసింది. అయితే బిల్లు ఉన్నవాటికే సుమా) ఇక బాక్స్ ఉంటే ఐఎంఈఐ నెంబరును సరిచూసుకోవచ్చు. ఒరిజినల్ యాక్సెసరీస్ లేకుంటే మరికొన్ని వందలు తగ్గించమని బేరం చేయవచ్చు. కనీసం 2జీబీ రామ్ తప్పనిసరి: సెల్ ఫోన్ వేగాన్ని మరింతగా పెంచేలా 2జీబీ రామ్ ఉన్న ఫోన్లు ఇప్పుడు రూ. 10 వేల కన్నా తక్కువ ధరకే లభిస్తున్నాయి. (ఉదాహరణకు లెనోవో ఏ 7000, జియోమీ రెడ్ మీ నోట్ 4జి, మైక్రోమ్యాక్స్ యు యురేకా). కాబట్టి సెకండ్ హ్యాండ్ ఫోన్లకు రూ. 7 వేల వరకూ పెట్టేట్లయితే 2జీబీ రామ్ ఉండేలా జాగ్రత్త పడాలి. అదే రూ. 5 వేల ధరలో అనుకుంటే 1జీబీ రామ్ కు పరిమితం కావచ్చు. ప్రాసెసర్ పనితీరు పరీక్షించండి. మీడియాటెక్ ప్రాసెసర్ అయితే దాని జోలికి పోకపోవడమే ఉత్తమం. ఈ ప్రాసెసర్లు ఒక సంవత్సరం తరువాత సరైన పనితీరును చూపడం లేదన్న ఫిర్యాదులు పెరుగుతున్నాయి. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్, ఇంటెల్ ప్రాసెసర్లున్న ఫోన్లయితే మంచిదని నిపుణుల సలహా. దొంగిలించబడినదా? అన్నది తెలుసుకోవాలి: చాలా వరకూ స్మార్ట్ ఫోన్లను ఎక్కడి నుంచో దొంగిలించి తెచ్చి తక్కువ ధరకు అమ్ముతున్న సందర్భాలు అనేకం. ఇటువంటి సందర్భాలలో దొంగ వద్ద సెల్ ఫోన్ బాక్స్ దాదాపు ఉండదు. ఒకవేళ బాక్స్ లేని ఫోన్ చూపినట్లయితే, *#06# నొక్కడం ద్వారా ఐఎంఈఐ నంబరును తెలుసుకోవచ్చు. ఆపై 'imeidetective.com' వెబ్ సైటుకు వెళ్లి సెర్చ్ చేయండి. ఆ ఫోన్ ఓనర్ అది పోయినట్టు ఫిర్యాదు ఇచ్చివుంటే తెలిసిపోతుంది. హార్డ్ వేర్ చెక్ చేయాలి: ఫోన్ ప్యానల్ ఎలా వుంది? టచ్ ఎలా పనిచేస్తోంది? ఏమైనా గీతలు పడ్డాయా? వంటివి పరిశీలించాలి. ఆపై ఓ ల్యాప్ టాప్ లేదా కంప్యూటర్ కు కనెక్ట్ చేసి చార్జింగ్ అవుతోందా? డేటా బట్వాడా ఎలా జరుగుతుందన్న విషయాలు గమనించాలి. సిమ్ కార్డు పెట్టిన తరువాత నెట్ వర్క్ ఎంత త్వరగా కనెక్ట్ అయిందన్న విషయమూ ముఖ్యమే. వారంటీ కోసం చూడండి: కొంటున్నది సెకండ్ హ్యాండ్ ఫోన్ అయినా కనీసం నెలల పాటు వారంటీ ఉండేలా చూసుకుంటే మంచిది. దీంతోపాటు సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు తాము ఫోన్లను విక్రయిస్తామని ముందుకు వస్తున్న సందర్భాలు అధికంగా ఉంటున్నాయి. ఫేస్ బుక్ వంటి వెబ్ సైట్ల ద్వారా స్నేహితులు లేదా వారి స్నేహితుల నుంచి ఫోన్లు కొంటే మంచిది. ఏదైనా తేడా వస్తే సోషల్ నెట్ వర్క్ లో వారి పరువు పోతుంది కాబట్టి, ప్రొడక్టు గురించిన పూర్తి వివరాలు ముందే చెబుతారు. ఇలా కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుని ఫోన్లు ఖరీదు చేస్తే, దాన్ని కూడా దీర్ఘకాలం పాటు ఏ ఇబ్బందులూ లేకుండా వాడుకోవచ్చు.

More Telugu News