: ఆన్ లైన్ మోసాలు ఆపేందుకు ఏం చేయాలంటే...: బ్యాంకర్లకు సీబీఐ సలహా

వివిధ బ్యాంకుల కస్టమర్ల నుంచి, తాము మోసపోయామంటూ వస్తున్న ఫిర్యాదులు పెరుగుతున్న వేళ, బ్యాంకులన్నీ ధ్వని విశ్లేషణ (వాయిస్ అనాలిసిస్) సేవలను ప్రారంభించాలని, తద్వారా ఈ తరహా మోసపూరిత చర్యలను అరికట్టవచ్చని సీబీఐ సలహా ఇచ్చింది. ఈ మేరకు పలు ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకుల ప్రతినిధులకు సీబీఐ జాయింట్ డైరెక్టర్ కేశవ్ కుమార్ తన ఆలోచనలను వివరించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తున్న 'సెంటర్ ఫర్ అడ్వాన్డ్స్ ఫైనాన్షియల్ రీసెర్చ్ అండ్ లెర్నింగ్' ఆధ్వర్యంలో జరిగిన వర్క్ షాప్ లో ఆయన ప్రసంగించారు. వాయిస్ అనాలిసిస్ ప్రారంభిస్తే, ఈ తరహా మోసాలకు అడ్డుకట్ట పడుతుందని భావిస్తున్నట్టు తెలిపారు. ఫైనాన్షియల్ రిస్క్ ను తగ్గించాల్సి వుందని ఆయన అన్నారు. దీంతోపాటు, ఎల్వీఏ (లేయర్డ్ వాయిస్ అనాలిసిస్) సాఫ్ట్ వేర్ ను వాడటం ద్వారా రుణం కోసం వచ్చేవారి మనసులోని ఉద్దేశం తెలుసుకునే అవకాశం సులువవుతుందని అన్నారు. ముంబైకి చెందిన ఓ నిర్మాణ రంగ సంస్థ చైర్మన్ ఓ బ్యాంకును మోసం చేసి రూ. 231 కోట్ల రుణం తీసుకున్న కేసును కేశవ్ కుమార్ ఉదహరించారు. నిఘాను పెంచడం, ఫోరెన్సిక్ సహాయాన్ని కోరడం ద్వారా బ్యాంకులు లబ్ధిని పొందవచ్చని సూచించారు.

More Telugu News