: వడ్డీ రేట్ల తగ్గింపు ప్రయోజనాలు కస్టమర్లకు ఇవ్వకుండా బ్యాంకుల కక్కుర్తి!

వృద్ధి రేటును మెరుగుపరచాలని, పారిశ్రామిక వేత్తలకు, ప్రజలకు తక్కువ వడ్డీలకు రుణాలు లభించేలా చూడాలన్న పెద్ద మనసుతో రిజర్వ్ బ్యాంక్ చైర్మన్ రఘురాం రాజన్ అర శాతం మేరకు రెపో రేటును తగ్గిస్తే, ఆ ప్రయోజనాన్ని ఖాతాదారులకు అందించకుండా బ్యాంకులు తమ కక్కుర్తి బుద్ధిని చూపుతున్నాయి. వడ్డీ రేట్లను అర శాతం తగ్గిస్తే, తమ మార్జిన్లపై ప్రభావం పడి, లాభాలు తగ్గుతాయన్న భయాల్లో ఉన్న బ్యాంకులు ఏదో మొహమాటానికి అన్నట్టు 0.25 నుంచి 0.4 శాతానికి మాత్రమే తమ తమ బేస్ రేట్లను తగ్గిస్తున్నట్టు ప్రకటిస్తూ, పూర్తి ప్రయోజనాలను దూరం చేస్తున్నాయి. ఈ ఏడాది ఆరంభం నుంచి రెపో, రివర్స్ రెపో వడ్డీరేట్లను 125 బేసిస్ పాయింట్లు (1.25 శాతం) తగ్గించగా, రుణగ్రస్తులకు అర శాతం నుంచి ముప్పావు శాతం మాత్రమే లాభం కలిగింది. ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 0.4 శాతం వడ్డీని తగ్గించిన సంగతి తెలిసిందే. ఆపై ఆంధ్రాబ్యాంకు సైతం అదే దారిలో నడిచింది. నేడు తాజాగా, అలహాబాద్ బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, యస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంకులు తమ బేస్ రేటును 0.25 శాతం తగ్గిస్తున్నట్టు ప్రకటించాయి. బ్యాంకులు పూర్తి స్థాయి ప్రయోజనాలను కస్టమర్లకు దగ్గర చేయడంలో విఫలమవుతుండటాన్ని ఆర్థికవేత్తలు తప్పుపడుతున్నారు. ఒకవైపు ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్, మరోవైపు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీలు బ్యాంకులపై మరింత ఒత్తిడి తెచ్చి పరపతి నిర్ణయాలకు అనుగుణంగా వడ్డీ రేట్లను తగ్గించేందుకు బ్యాంకులు ముందుకు వచ్చేలా చూడాలని కోరుతున్నారు.

More Telugu News