: మోదీ ఆకాశంలోకి చూస్తున్నారు, కానీ క్షేత్రస్థాయిలో చర్యలేవి?: ప్రశ్నించిన ఆర్బీఐ చీఫ్

ప్రధాని నరేంద్ర మోదీ తన అలోచనలతో మనకన్నా ముందుగా పరుగులు పెడుతున్నారని వ్యాఖ్యానించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ రఘురాం రాజన్, ఇండియాలో క్షేత్రస్థాయిలో ఆశించిన చర్యలు జరగడం లేదని ఆక్షేపించారు. పెట్టుబడుల కోసం విదేశీ పర్యటనలకు వెళ్లే ముందు ఇండియాలో క్షేత్రస్థాయి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తాను భావిస్తున్నట్టు తెలిపారు. అప్పుడే ఆయన పర్యటనల ఫలాలు వేగంగా దేశానికి అందుతాయని వివరించారు. ఇండియా తరఫున వాదనను ప్రపంచానికి వినిపించేందుకు మోదీని సరైన వ్యక్తిగా అభివర్ణించిన ఆయన, పర్యటనలకు ముందే ఇండియాపై సదభిప్రాయం కలిగేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఓ నిపుణుడైన ఆర్థికవేత్తగా, తాను చేయగలిగిందే చేస్తానని కుండబద్దలు కొట్టినట్టు చెప్పే రఘురాం రాజన్, ఇటీవలి పరపతి సమీక్షలో అందరినీ ఆశ్చర్యపరుస్తూ, వడ్డీ రేట్లను అర శాతం తగ్గించిన సంగతి తెలిసిందే. ఓ టీవీ చానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన "మోదీ మనందరికన్నా ఎంతో ముందున్నారు. ఆయన్ను అందుకోవాలంటే, ఎన్నో కోణాల్లో మనం వేగం పుంజుకోవాలి. ఉదాహరణకు, భారత ఆర్థిక వ్యవస్థకు విదేశీ పెట్టుబడులను ఆహ్వానించాలని వెళ్లి, అందులో విజయం సాధించామనుకుందాం. పెట్టుబడులతో ఇక్కడికి వచ్చిన కంపెనీలకు అడ్డంకులు ఏర్పడితే? వారి వ్యాపారం చేసుకోవడానికి అనువైన వాతావరణ పరిస్థితి, అనుమతుల లభ్యత, మౌలిక వసతుల కల్పనలో విఫలమైతే..? ముందుగా వీటన్నింటిలో సమస్యలు అధిగమించిన తరువాతనే పెట్టుబడుల కోసం యత్నిస్తే మేలు కలుగుతుంది" అన్నారు. ఇండియా కొన్ని విషయాల్లో వెనుకబడివున్నప్పటికీ, అంచనా వేస్తున్నంత ఘోరమైన పరిస్థితులు లేవని రాజన్ అభిప్రాయపడ్డారు.

More Telugu News