: '8 బ్యాడ్ మనీ హ్యాబిట్స్'... వదిలించుకుంటే మీరు ధనవంతులే!

డబ్బు విషయంలో మీకున్న అలవాట్లే భవిష్యత్తులో మీరు ధనవంతులుగా మిగులుతారా? లేక వేతన జీవుడిగానే ఉంటారా? లేకపోతే అప్పుల్లో కూరుకుపోతారా? అన్న విషయాన్ని తేలుస్తుంది. వస్తున్న డబ్బుకు తగ్గట్టుగా ఖర్చు చేస్తూ, పొదుపు దిశగా నడిస్తే దీర్ఘకాలంలో దాచుకున్న రూపాయి ఎన్నో రెట్లు పెరుగుతుంది. ఈ నేపథ్యంలో డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెట్టేలా చేసే మార్గాలు, వాటి నుంచి బయటపడే దారులు... వేతనం కన్నా అధికంగా ఖర్చు పెట్టడం: ఆర్థికంగా కుంగదీసే అంశాల్లో ఇది అత్యంత ప్రధానమైనది. వచ్చిన జీతంతో పోలిస్తే నెలాఖరు అయ్యేసరికి పెట్టిన ఖర్చు అధికంగా ఉందంటే, మీరు అప్పుల్లో కూరుకుంటున్నట్టు లెక్క. ఇలా జరగకుండా ఉండాలంటే, ఆదాయం, ఖర్చు లెక్కలను ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ఉండాలి. ఇందుకోసం అవసరాలు, కోరికల పేరిట రెండు జాబితాలు తయారు చేసుకుని అవసరాలు ముందుగా తీర్చుకోవాలి. ఆపై కోరికలను తగ్గించుకుంటే ఖర్చు దానంతట అదే తగ్గుతుంది. ఒకవేళ అవసరాలకు మాత్రమే వాడుతున్నా వేతనం కన్నా అధికం ఖర్చువుతోందంటే, ఆదాయాన్ని పెంచుకోవాల్సిందే. 'రేపటి నుంచి' అన్న మాటే వద్దు: "ఈ నెల కుదర్లేదు, వచ్చే నెల నుంచి పొదుపు చేద్దాం" అన్న మాటను మీ జీవితంలోకి రానీయొద్దు. ఏ ఒక్క నెలలో ఇలా అనుకున్నా, అదే ఆలోచన కొనసాగి మీ పొదుపును మరింత ఆలస్యం చేస్తుంది. ఎంత త్వరగా పొదుపు ప్రారంభిస్తే, దీర్ఘకాలంలో అది అంత ఎక్కువ రాబడిని అందిస్తుంది. చేతిలో డబ్బుందని భావిస్తే, వెంటనే దాన్ని పొదుపు ఖాతాల్లోకి చేర్చండి. అంతగా ఖర్చులు చుట్టుముడితే, అందులో నుంచి కావలసినంత తీసుకోవచ్చు. అనవసర ఖర్చులు అసలొద్దు: ఈ పోటీ ప్రపంచంలో పక్కవారిని లేదా స్నేహితులు, బంధువులను చూసి, అలాగే ఉండాలని కోరుకుంటూ లైఫ్ స్టయిల్ లో మార్పులు చేసుకోవడాన్ని తగ్గించాలి. ఖరీదైన హ్యాండ్ బ్యాగ్ కావాలనో, మరో మంచి స్మార్ట్ ఫోన్ కొందామనో ఆలోచించొద్దు. అలా చేస్తే మీరు అప్పులు చేయాల్సి వస్తుంది. ఉదాహరణకు లక్ష రూపాయల టీవీ కొనుగోలు చేసి నెలవారీ కిస్తీలు కడుతున్నారంటే, వాస్తవానికి ఆ టీవీ మీకు అవసరం లేదని, లగ్జరీ కోసమే కొన్నారని అర్థం. రుణం తీసుకుని వస్తువులు కొనడం తప్పనిసరే. అయితే, ఆ రుణం ఏ టూ వీలర్ కోసమో, ఇంటి కోసమో, పిల్లల చదువుల కోసమో అయితే మంచిదే. లగ్జరీ లైఫ్ స్టయిల్ కోసం మాత్రం కాకూడదు. పెట్టుబడి పెట్టండి... గ్యాంబ్లింగ్ వద్దు: చాలా మంది స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకోకుండానే పెట్టుబడులు పెడుతుంటారు. ఇది అంత మంచి పని కాదు. పలానా కంపెనీ ఈక్విటీ బాగా పెరుగుతుందని ఎవరో చెబితే నమ్మి అడుగులు వేయద్దు. దానిపై పూర్తిగా విశ్లేషణ ఉండాలి. రోజువారీ ట్రేడింగ్ అసలే వద్దు. ఏదైనా కంపెనీని నమ్మితే దానిలో పెట్టుబడి పెట్టి రెండు నుంచి మూడేళ్ల పాటు వేచి చూసేలా ఉండాలి. స్వల్పకాల లక్ష్యాలతో గ్యాంబ్లింగ్ ఆడితే, నష్టపోయే ప్రమాదాలు వెన్నంటే ఉంటాయి. క్రమానుసారం...: మనమంతా పొదుపు చేయాలని అనుకుంటాం. చాలా మంది ట్రై చేస్తారు కూడా. అయితే, అత్యధికులు క్రమానుసారం పొదుపు చేయరు. ఇది ఇండియాలో సర్వసాధారణం. ఇలా జరగకుండా ఉండాలంటే, నెలకు ఎంత పొదుపు చేయగలమన్న విషయాన్ని గుర్తెరగాలి. నెలారంభంలోనే ఆ డబ్బు పక్కన బెట్టి మిగిలినదాంతోనే సర్దుకోవాలి. రిస్క్ అధికంగా ఉన్న చోట పెట్టుబడి వద్దు: వస్తుందో పోతుందో ఎవరూ చెప్పలేని చోట బెట్టింగ్ అసలు వద్దు. ఒకవేళ ఒకసారి డబ్బు వచ్చినా, ఆ ఆనందంతో మరోసారి బెట్ చేసి వచ్చినదాన్ని పోగొట్టుకున్న వారి సంఖ్యే ఎక్కువగా ఉంటుందని మరవొద్దు. స్టాక్ మార్కెట్లలో రిస్క్ దాగుంటుంది. ఒడిదుడుకులుంటాయి. అయితే, దీర్ఘకాలానికి మాత్రం రాబడి బాగుంటుంది. కాబట్టి ఈక్విటీలు, మ్యూచువల్ ఫండ్స్ వైపు చూసేట్లయితే, ఏళ్ల తరబడి నిరీక్షించేందుకు సిద్ధంగా ఉండాలి. డ్యూ డేట్ ముగిసిన తరువాత చెల్లింపులు: అది కరెంటు బిల్లుగానీ, వాటర్ బిల్లుగానీ, క్రెడిట్ కార్డు బిల్లుగానీ, మరింకేదైనా సరే చెల్లించాల్సిన డబ్బును నియమిత తేదీలోగా కట్టేయాలి. లేకుంటే దానిపై జరిమానా పడుతుంది. ఓ కుటుంబం డ్యూడేట్ దాటకుండా అన్ని బిల్లులనూ చెల్లిస్తే, నెలకు రూ. 200 వరకూ మిగిలే అవకాశాలుంటాయి. అదే సంవత్సరానికి రూ. 2,400 అవుతుంది. పదేళ్లకు రూ. 24,000. ఈ రూ. 2 వందలను ప్రతినెలా దాచుకుంటే, పదేళ్లకు పెట్టిన రూ. 24 వేల పెట్టుబడి దాదాపు రూ. 60 వేలకు పైగా పెరుగుతుంది. దురలవాట్లకు దూరంకండి: స్మోకింగ్, మద్యం, తరచూ హోటల్ భోజనాలు వంటివి ఆర్థిక కష్టాలను పెంచుతాయి. రోజుకు రూ. 50 నుంచి రూ. 100తో స్మోకింగ్ చేసేవాళ్లు, దాన్ని మానేస్తే, ఒక సంవత్సరంలో రూ. 18 వేల నుంచి రూ. 36 వేల వరకూ మిగుల్చుకోగలుగుతారు. పెట్టే ఖర్చు చిన్నదిగానే కనిపిస్తుంది. కానీ దీర్ఘకాలంలో అది వేలు, లక్షల నష్టాన్ని కంటి ముందు నిలుపుతుంది. మీ ఆరోగ్యం, జేబులోని డబ్బుపై ప్రభావం చూపే అలవాట్లుంటే, వాటిని వెంటనే వదిలించుకోండి. ఈ సూచనలు పాటించి సాధ్యమైనంత ఎక్కువ డబ్బులను పొదుపు చేస్తే, అనతికాలంలోనే మీ కోరికలన్నీ తీరేంత నిధి పోగవుతుందనడంలో సందేహం లేదు.

More Telugu News