: ఆండ్రాయిడ్ యూజర్లపై ‘అడల్ట్ ప్లేయర్’ వల... డౌన్ లోడ్ చేస్తే రూ.33 వేలు చెల్లించాల్సిందేనట!

స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ పట్ల భలే క్రేజ్. ఈ ఒక్క చిన్న కారణాన్ని ఆసరా చేసుకుని ఓ ‘అశ్లీల’ యాప్ ఆండ్రాయిడ్ యూజర్లపై వల విసురుతోంది. పెద్ద మొత్తంలో డబ్బు గుంజుతోంది. తొలుత చూడముచ్చటైన సందేశాలతో ఆసక్తి రేకెత్తించే రూపంలో రంగప్రవేశం చేసే ‘అడల్ట్ ప్లేయర్’ యాప్ ఆపై ఆండ్రాయిడ్ యూజర్ల జేబులను గుల్ల చేస్తుందట. యాప్ ను డౌన్ లోడ్ చేయగానే, ఫోన్ లోని సర్వీసులన్నిటినీ నిలిపేసే అడల్ట్ ప్లేయర్, ఫ్రంట్ కెమెరాతో యూజర్ ఫొటో తీస్తుందట. ఆ తర్వాత ఫేస్ బుక్ పేరిట ఓ మెసేజ్ ఫోన్ స్క్రీన్ పై ప్రత్యక్షమవుతుంది. అశ్లీల చిత్రాలు చూసినందుకు ఫోన్ నెంబరును బ్లాక్ చేస్తున్నామని.., 500 డాలర్లు (రూ.33 వేలు) చెల్లిస్తేనే కాని బ్లాక్ లిస్ట్ నుంచి నెంబర్ ను తొలగించమని ఆ మెసేజ్ చావు కబురు చల్లగా చెబుతుంది. ఈ తరహా ఇబ్బందికర పరిస్థితుల్లో మెజారిటీ యూజర్లు గుట్టుచప్పుడు కాకుండా సదరు మొత్తాన్ని చెల్లించేసి తమ నెంబర్ కు బ్లాక్ లిస్ట్ నుంచి విముక్తి కల్పించుకుంటున్నారు. ‘జడ్ స్కేలర్’ అనే సాఫ్ట్ వేర్ సంస్థ తొలుత ఈ ప్రమాదకర యాప్ ను గుర్తించింది.

More Telugu News