: టీమిండియాను వరుణుడు ఆదుకున్నాడా?

భారత్, శ్రీలంక జట్ల మధ్య మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా కొలంబోలో జరుగుతున్న చివరి టెస్టుకు వరుణుడు అంతరాయం కలిగించాడు. తొలి రోజు ఆట సాగిన కాసేపటికే నేనున్నానంటూ వానదేవుడు పలకరించడంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్ నిలిచిపోయింది. వర్షం వల్ల ఆట ఆపేసే సమయానికి కోహ్లీ సేన 2 వికెట్ల నష్టానికి 50 పరుగులు చేసింది. అప్పటికి 15 ఓవర్లే పూర్తయ్యాయి. అంతకుముందు, శ్రీలంక టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. పిచ్ పై పచ్చిక ఉండడంతో లంక సారథి మాథ్యూస్ మరేమీ ఆలోచించకుండా పర్యాటక జట్టుకు బ్యాటింగ్ అప్పగించాడు. లంక పేసర్లు ప్రసాద్, ప్రదీప్ తమ కెప్టెన్ నిర్ణయం సరైనదేనని నిరూపిస్తూ నిప్పులు చెరిగారు. ఆరంభంలో భారత్ ను ఇబ్బందుల్లోకి నెట్టారు. ప్రసాద్ ఓపెనర్ రాహుల్ (2) వికెట్ తీయగా, ప్రదీప్ వన్ డౌన్ లో వచ్చిన రహానే (8) ను బలిగొన్నాడు. అప్పటికి టీమిండియా చేసింది 14 పరుగులే. దాంతో, ఓపెనర్ పుజారా (19 బ్యాటింగ్), కెప్టెన్ కోహ్లీ (14 బ్యాటింగ్) జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ మూడో వికెట్ కు అజేయంగా 36 పరుగులు జోడించడంతో టీమిండియా 50 మార్కు చేరుకుంది. ఆ దశలో వర్షం రావడంతో మైదానం తడిసి ముద్దయింది. దాంతో, ఆటను నిలిపివేశారు. వరుణుడు అడ్డుపడకపోతే టీమిండియా మరిన్ని వికెట్లు కోల్పోయే అవకాశాలు ఉండేవని కామెంటేటర్లు అభిప్రాయపడ్డారు. పిచ్ పై పచ్చిక ఎక్కువగా ఉండడంతో పేస్, స్వింగ్ రాబట్టడం సులువు అని వారు పేర్కొన్నారు.

More Telugu News