: క్లిక్, పిక్, హ్యాపీ... అంటూ రూటు మార్చిన ఈ-కామర్స్ కంపెనీలు

ఇండియాలో ఈ-కామర్స్ రంగం శరవేగంగా విస్తరిస్తోందన్న విషయం అందరికీ తెలిసిందే. ఇదే విషయాన్ని ఎన్నో సర్వేలు కూడా స్పష్టం చేశాయి. ప్రస్తుతం రూ. 3 లక్షల కోట్లుగా ఉన్న సంఘటిత రిటైల్ మార్కెట్ రంగం వచ్చే ఐదేళ్లలో రూ. 12 లక్షల కోట్లకు చేరుతుందన్న అంచనాలున్నాయి. ఇదే సమయంలో ఈ-కామర్స్ విభాగం అంతకుమించిన వేగంతో విస్తరించి ప్రస్తుతమున్న రూ. 15 వేల కోట్ల నుంచి 2020 నాటికి రూ. 2 లక్షల కోట్లను దాటుతుందని కన్సల్టింగ్ సంస్థ టెెక్నోపార్క్ అంచనా వేసింది. స్థిరమైన వేగంతో దూసుకెళ్తున్నా, భారత ఈ-కామర్స్ దిగ్గజాలు మరింత వ్యాపారాభివృద్ధిపై కన్నేశాయి. తాజాగా ఫిజికల్ స్టోర్స్ ప్రారంభిస్తున్నాయి. ఆన్ లైన్లో 'క్లిక్' చేయడం ద్వారా కొనుగోలు చేసి, దాన్ని సమీపంలోని ఫిజికల్ స్టోర్ నుంచి 'పిక్' చేసుకుని, 'హ్యాపీ'గా ఉండమని చెబుతున్నారు. కస్టమర్లకు మరింత దగ్గరకావాలన్న ఉద్దేశంతోనే, అన్ని రకాల డెలివరీ ఆప్షన్స్ ను అందిస్తున్నామని, అందువల్లే తాము విక్రయించే ప్రొడక్టులతో కూడిన స్టోర్స్ ప్రారంభిస్తున్నామని ఈ-కామర్స్ కంపెనీలు చెబుతున్నాయి. ముంబై కేంద్రంగా పనిచేస్తున్న మార్కెటింగ్ అనలిటిక్స్ సంస్థ హంసా సీక్విటీ, రిటెయిలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాలు సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో ప్రతి నలుగురు కస్టమర్లలో ముగ్గురు ఆన్ లైన్ తో పాటు ఫిజికల్ స్టోర్లనూ సందర్శించారని వెల్లడైంది. సమీప భవిష్యత్తులో రిటైల్ సెగ్మెంట్, అందునా ఈ-కామర్స్ విస్తరణకు టియర్ 2, 3 పట్టణాలే కీలకమని భావిస్తున్న కంపెనీలు దేశవ్యాప్తంగా ఉన్న 3 వేలకు పైగా ఈ తరహా పట్టణాలపై కన్నేశాయి. గేటెడ్ కమ్యూనిటీలు, అపార్టుమెంట్లలోకి డెలివరీ బాయ్స్ వెళ్లడానికి కొన్ని ఇబ్బందులు ఉండటం కారణంగా, కస్టమర్లు తాము ఆర్డర్ చేసుకున్న వస్తువును తమకు నచ్చిన సమయంలో ఇల్లు చేర్చుకునే సదుపాయం దగ్గర చేసేందుకే ఫిజికల్ డెలివరీ సెంటర్లు ప్రారంభిస్తున్నట్టు కంపెనీలు వెల్లడిస్తున్నాయి. ఇండియాలోని అతిపెద్ద ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ ఇప్పటికే 20 స్టోర్లను నిర్వహిస్తోంది. ఇక్కడి నుంచి కస్టమర్లు తమ షిప్ మెంట్స్ స్వయంగా డెలివరీ తీసుకోవచ్చు. మార్చి 2016 నాటికి ఇవే తరహాలో 100 డెలివరీ సెంటర్లను ప్రారంభించాలన్న లక్ష్యంతో ఉంది. మరో సంస్థ అమెజాన్ సైతం ఇదే దారిలో నడుస్తోంది. పేటీఎం అయితే, ఏకంగా 30 వేల నుంచి 50 వేల రిటైల్ ఔట్ లెట్లను ప్రారంభిస్తామని వెల్లడించింది. రిలయన్స్ రిటైల్, ఆదిత్య బిర్లా వంటి కంపెనీలు సైతం మారుతున్న కస్టమర్ల ఇష్టాయిష్టాలకు అనుగుణంగా నడచుకోవాలని అడుగులు వేస్తున్నాయి.

More Telugu News