: ఇండియా అంటే భయంతో వందల కొద్దీ అణుబాంబులు తయారుచేస్తున్న పాకిస్థాన్: వాషింగ్టన్ పోస్ట్ సంచలన కథనం

మరో పదేళ్లలో అమెరికా, రష్యాల తరువాత అత్యధిక అణుబాంబులను కలిగివున్న దేశంగా పాకిస్థాన్ నిలుస్తుందని, పొరుగున ఉన్న ఇండియా అంటే భయపడుతున్న ఆ దేశం భారీఎత్తున అణ్వస్త్రాల తయారీకి ప్రణాళికలు రూపొందించిందని 'వాషింగ్టన్ పోస్ట్' ఓ సంచలన కథనాన్ని ప్రచురించింది. సాలీనా 20 అణుబాంబులను తయారు చేసి దాచుకుంటున్న పాకిస్థాన్, వచ్చే పదేళ్లలో వేలకొద్ది బాంబులు ఒకేసారి వేస్తే వచ్చేంత శక్తితో కూడుకున్న 350 అణు ఆయుధాలను తయారు చేయనుందని వివరించింది. 2025 నాటికి ప్రపంచంలో అత్యధిక అణుబాంబులున్న దేశాల్లో పాకిస్థాన్ టాప్-3లో నిలవనుందని అంచనా వేసింది. "ఇండియా పేరు వింటేనే చాలు భయపడుతున్న పాకిస్థాన్ శరవేగంగా అణు సామర్థ్యాన్ని పెంచుకుంటోంది" అంటూ కార్నేజ్ ఎండోమెంట్స్ న్యూక్లియర్ పాలసీ ప్రోగ్రామ్ కో-డైరెక్టర్ టోబీ డాల్టన్, స్టిమ్సన్ సెంటర్ సహ వ్యవస్థాపకులు మైఖేల్ క్రిపాన్ లు ఓ ప్రత్యేక కథనం రాశారు. ఇప్పటికే అణుబాంబుల విషయంలో భారత్ ను పాకిస్థాన్ అధిగమించింది. ప్రస్తుతం పాక్ వద్ద 120 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉండగా, ఇండియా వద్ద 100 మాత్రమే ఉన్నాయి. అయితే, పాకిస్థాన్ తక్కువ ప్రభావం చూపే యురేనియం వార్ హెడ్లతోనే సరిపెట్టుకుంటోందని, భారత్ మాత్రం భారీ ఎత్తున విధ్వంసం చేయగల ప్లూటోనియం వార్ హెడ్ల తయారీలో ఉందని వారు వివరించారు. ఈ విషయంలో పాకిస్థాన్ వద్ద అధునాతన సాంకేతికత అందుబాటులో లేదని వారు పేర్కొన్నారు.

More Telugu News