: యువ సంచలనం హార్దిక్ విద్యార్హతలు తెలుసా... గ్రేస్ మార్కులు కలపడంతో పాస్ అయ్యాడట!

హార్దిక్ పటేల్... ఇప్పుడు దేశవ్యాప్తంగా వినిపిస్తున్న పేరు. గుజరాత్ లో పటేల్ వర్గానికి యువ నేత. 44 శాతం మార్కులతో వెనుకబడిన తరగతులకు మెడిసిన్ సీటు వస్తుంటే, 90 శాతం మార్కులు వచ్చిన తమకు సీట్లు దొరకడం లేదంటూ, ఉద్యమానికి తెరలేపిన నవతరం నేత. అంతా ఓకే. కానీ హార్దిక్ ఏం చదువుకున్నాడు? కేవలం 49.6 శాతం మార్కులతో బీకామ్ పూర్తి చేశాడట. కమర్షియల్ కమ్యూనికేషన్స్ విభాగంలో 17 మార్కులు మాత్రమే తెచ్చుకుంటే, 8 మార్కులు కలిపి పాస్ చేయాల్సి వచ్చిందని, హార్దిక్ చదివిన కాలేజీలో పనిచేస్తున్న అధ్యాపకుడు ఒకరు గుర్తు చేసుకున్నారు. షాజానంద్ కాలేజీలో చదివిన హార్దిక్ ఫైనల్ ఇయర్ లో ఇంగ్లీషుతో పాటు ఎకనామిక్స్, అకౌంటెన్సీ, స్టాటిస్టిక్స్ విభాగాల్లో కనీస పాస్ మార్కులు మాత్రమే తెచ్చుకున్నాడని తెలుస్తోంది. విద్యాభ్యాసం సమయంలో హార్దిక్ యావరేజ్ స్టూడెంట్ మాత్రమేనని, సిగ్గు పడుతూ ఉండేవాడని షాజానంద్ కాలేజీ డైరెక్టర్ దశరథ్ పటేల్ గుర్తు చేసుకున్నాడు. అప్పట్లో ఏ విధమైన నాయకత్వ లక్షణాలు అతనిలో కనిపించేవి కాదని, ఇప్పుడు ఇలా ఎదగడం ఆశ్చర్యాన్ని కలిగించిందని వివరించారు.

More Telugu News