: హైదరాబాద్ వద్దనుకుంటే పుష్కరం క్రితమే తెలంగాణ వచ్చి వుండేది!: కేసీఆర్

తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన తరువాత, హైదరాబాదుపై ఆశలు వదులుకుని ఉంటే, 12 సంవత్సరాల క్రితమే ప్రత్యేక రాష్ట్రం వచ్చి వుండేదని ముఖ్యమంత్రి కేసీఆర్ అభిప్రాయపడ్డారు. తెలంగాణకు గుండెకాయ వంటి హైదరాబాదుపై రాజీ పడలేదు కాబట్టే, ఓ పదేళ్లు ఆలస్యమైనా, నూతన రాష్ట్రాన్ని పోరాడి సాధించుకున్నామని ఆయన అన్నారు. తన చాంబర్లో తెలంగాణ మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్ష జరిపిన కేసీఆర్, ఆంధ్రా నేతలు హైదరాబాదును పొరుగు నగరంగానే చూశారని, అందువల్లే అనుమతి లేని కట్టడాల సంఖ్య ఎక్కువగా ఉందని అభిప్రాయపడ్డారు. ఈ అస్తవ్యస్త పరిస్థితిని చక్కదిద్దాల్సి వుందని, నగరాన్ని తీర్చిదిద్దుకునే దిశగా ప్రజా ప్రతినిధులు, అధికారులు అలసత్వాన్ని వీడాలని ఆయన సూచించారు. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఎ, వాటర్‌ బోర్డు వంటి సంస్థలు తమ పనితీరు మెరుగుపరచుకోవాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. అక్రమ నిర్మాణాల విషయంలో ఏ దారిలో వెళితే మేలు కలుగుతుందో ఆలోచించి ముందడుగు వేయాలని, భవిష్యత్తులో అటువంటి ప్రయత్నాలు జరగకుండా, ఇప్పటినుంచే జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

More Telugu News