: షీనాను ఎలా చంపారంటే...!

స్టార్ ఇండియా సీఈవో పీటర్ ముఖర్జియా భార్య ఇంద్రాణి ఎంతటి ఘటికురాలో మీడియాలో వస్తున్న కథనాలు తేటతెల్లం చేస్తున్నాయి. కన్నబిడ్డనే ఆమె హతమార్చిన వైనం వింటుంటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. 2012 ఏప్రిల్ 24న షీనా హత్యకు గురైంది. ఆ రోజు ఏం జరిగిందంటే... సాయంత్రం 6.30 ప్రాంతంలో షీనాకు ఇంద్రాణి నుంచి ఫోన్ వచ్చింది. "బాంద్రాలోని నేషనల్ కాలేజ్ సమీపంలో కలుద్దాం, ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి" అన్నదే ఆ ఫోన్ కాల్ సారాంశం! అప్పటికే ప్లాన్ సిద్ధం చేసుకున్న ఇంద్రాణి ఓ కార్లో తన మాజీ భర్త సంజీవ్ ఖన్నా, డ్రైవర్ శ్యామావర్ రాయ్ తో బయల్దేరింది. రాహుల్ తో కలిసి షీనా కాస్త ముందుగానే బాంద్రా చేరుకుంది. తానొచ్చిన విషయాన్ని ఇంద్రాణికి ఫోన్ ద్వారా తెలిపింది. అనంతరం రాహుల్ అక్కడి నుంచి నిష్క్రమించాడు. కొద్ది సేపటి తర్వాత అక్కడికి చేరుకున్న ఇంద్రాణి తన కార్లో ఎక్కమని షీనాను కోరింది. కార్లో సంజీవ్ ఖన్నా ఉండడంతో ఎక్కేందుకు షీనా నిరాకరించింది. దాంతో, షీనాను ఇంద్రాణి కార్లోకి లాగడం, కారు ముందుకు దూకడం వెంటనే జరిగిపోయాయి. ముందుగా నిర్ణయించుకున్న విధంగానే డ్రైవర్ శ్యామావర్ రాయ్ కారును ఈస్ట్రన్ ఎక్స్ ప్రెస్ హైవే మీదకు తీసుకెళ్లాడు. కాస్త ముందుకెళ్లిన తర్వాత కారు ఆపేశారు. షీనా చేతులను సంజీవ్ ఖన్నా పట్టుకోగా, కాళ్లను డ్రైవర్ పట్టుకున్నాడు. ఇంద్రాణి నిర్దయగా కన్న కూతురు మెడ నులిమి చంపేసింది. ఖోపోలి-పెన్ మార్గంలో జనసంచారం లేని ఓ ప్రాంతంలో షీనా మృతదేహంపై పెట్రోల్ పోసి అగ్నికి ఆహుతి చేశారు. ఆ తర్వాత, ఏమీ తెలియనివాళ్లలా తిరిగొచ్చేశారు. ఇక, 2012 మే 23న పెన్ పోలీసులకు ఓ శవం తాలూకు అవశేషాలు లభ్యమయ్యాయి. అది ప్రీ ప్లాన్డ్ మర్డర్ అని తెలియని పోలీసులు యాక్సిడెంటల్ డెత్ గా కేసు నమోదు చేసుకున్నారు. అవశేషాలను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. అంతకుముందు, ఏప్రిల్ 25న రాహుల్... షీనా ఫోన్ కు కాల్ చేస్తే స్విచాఫ్ అని వచ్చింది. రెండ్రోజుల పాటు వేచి చేసిన రాహుల్... షీనా కనిపించడం లేదంటూ ఖార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ముంబయి పోలీసులు ఇంద్రాణిని వివరాలు అడగ్గా, షీనా అమెరికాలో ఉందని బదులిచ్చింది. ఆ తర్వాత రోజు రాహుల్ ఫోన్ కు షీనా సెల్ నెంబర్ నుంచి కొన్ని సందేశాలు వచ్చాయి. తమ మధ్య ఉన్న బంధాన్ని తెంచుకుంటున్నట్టు ఆ సందేశాల్లో ఉంది. ఆ తర్వాత రాహుల్ చేసిన కాల్స్ కు మాత్రం సమాధానం రాలేదు. ఇటీవల డ్రైవర్ అనుమానాస్పద స్థితిలో కనిపించడంతో పోలీసులు తమదైన శైలిలో విచారించారు. దాంతో, షీనా హత్యోదంతం వెలుగులోకి వచ్చింది. తద్వారా, ఇంద్రాణిలోని చీకటి కోణం లోకానికి వెల్లడైంది.

More Telugu News