: రోడ్డుపై వెళుతుండగానే కారును చార్జ్ చేసుకోవచ్చు... ఫ్యూచర్ టెక్నాలజీ ఇదేనంటున్న బ్రిటన్!

ఇప్పుడైతే కార్లు పెట్రోల్, డీజిల్ తో నడుస్తున్నాయి కానీ, భవిష్యత్తులో వాటి పరిస్థితేంటి? ప్రపంచంలో మున్ముందు చమురు నిల్వలు తరిగిపోయి, ప్రజలు ప్రత్యామ్నాయ ఇంధనాలపై ఆధారపడక తప్పదని మేధావులు ఎప్పటి నుంచో చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పట్టాలెక్కినవే హైబ్రిడ్ కారు ప్రాజెక్టులు. కారు, అందులో ఓ బ్యాటరీ ఉంటే చాలు. ప్రయాణాల్లో మార్గమధ్యంలో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ల వద్ద చార్జ్ చేసుకుంటూ వెళ్లిపోవచ్చు. అయితే, బ్రిటన్ ఓ అడుగు ముందుకేసింది. చార్జింగ్ స్టేషన్లతో పనిలేకుండా, రోడ్డుపై వెళుతుండగానే కారును చార్జ్ చేసుకునేందుకు వీలు కల్పించే అత్యాధునిక టెక్నాలజీ అభివృద్ధికి పచ్చ జెండా ఊపింది. ఈ అంశంపై పరిశోధనలకు అనుమతి మంజూరు చేసింది. ఇందులో భాగంగా, రోడ్ల కింద ప్రత్యేకమైన సాధన సంపత్తిని ఏర్పాటు చేస్తారు. రోడ్డు కింద ఏర్పాటు చేసిన ప్రత్యేక కేబుళ్లు విద్యుదయస్కాంత శక్తిని ఉత్పత్తి చేస్తాయి. ఈ శక్తి విద్యుచ్ఛక్తిగా రూపాంతరం చెందుతుంది. తద్వారా కార్లలో ఉన్న చార్జింగ్ యూనిట్ శక్తి నింపుకుంటుంది. ఈ ప్రాజెక్టు కోసం యూకే గవర్నమెంట్ వచ్చే ఐదేళ్లలో 779 మిలియన్ డాలర్లు ఖర్చు చేయాలని యోచిస్తోంది.

More Telugu News