: 'టెక్నో నెక్ పోశ్చర్' బాధిస్తోందా?... అయితే, ఇలా చేయండి!

ఇంటర్నెట్ వాడకం పెరిగిపోయింది. డెస్క్ టాప్, ల్యాప్ టాప్, స్మార్ట్ ఫోన్ పై గంటల కొద్దీ సమయాన్ని గడిపేస్తున్నారు. అదే సమయంలో శారీరక వ్యాయామానికి వెచ్చించే సమయం తగ్గింది. దీంతో పలు రుగ్మతలు శరీరాలను పట్టిపీడిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో టెక్కీలను బాధించే సమస్యల్లో ప్రధానమైనది మెడ నొప్పి. దీనినే ఇప్పుడు 'టెక్నో నెక్ పోశ్చర్' అని పిలుస్తున్నారు. కంప్యూటర్, స్మార్ట్ ఫోన్ తో పని చేసినప్పుడు ముందుకు వంగి పని చేస్తుంటాం. దీని వల్ల మెడపై అదనపు బరువు పడుతుంది. నిల్చునేప్పుడు కూడా సరైన భంగిమలో నిల్చోలేకపోతున్నారు. దీంతో నడుంతోపాటు, మెడపై కూడా అదనపు ఒత్తిడి పడుతోంది. ఇలా టెక్కీలను టెక్నో నెక్ పోశ్చర్ బాగా ఇబ్బంది పెడుతోంది. దీనికి వైద్యులను సంప్రదించడంతో పాటు స్వీయ పరీక్షలు చేసుకుని సరిదిద్దుకుంటే ఈ సమస్య నుంచి బయటపడవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. నిల్చునేటప్పుడు రెండు భుజాలు సమానంగా ఉన్నాయో, లేదో సరిచూసుకోవాలని, రెండు భుజాలు సమానంగా లేని పక్షంలో రెండు భుజాలు సమానంగా ఉండేలా నిటారుగా నిల్చోవాలని చెబుతున్నారు. అలాగే నడిచేటప్పుడు నిటారుగా నడుస్తున్నారా? లేక ఒక వైపు ఒంగి నడుస్తున్నారా? అన్నది సరిచూసుకోవాలని వారు సూచిస్తున్నారు. కంప్యూటర్ పై పని చేసేటప్పుడు రెండు భుజాలకు తల సమాన దూరంలో ఉంటుందో, లేదో సరి చూసుకోవాలని వారు చెబుతున్నారు. సరైన పోశ్చర్ లో కూర్చుంటే మెడ, నడుం నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు సలహా ఇస్తున్నారు.

More Telugu News