: 'ఇండిపెండెన్స్ డే'ను వినూత్నంగా జరుపుకోవాలా? ఇలా చేసి చూడండి!

బ్రిటీష్ పాలకుల నుంచి భారతావనికి స్వాతంత్ర్యం వచ్చి 69 సంవత్సరాలు అయింది. ఈ సందర్భంగా ప్రతి భారతీయుడూ స్వాతంత్ర్యం కోసం జరిపిన పోరాటాన్ని, సర్వస్వమూ త్యాగం చేసిన పెద్దలను గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ స్ఫూర్తిని, దేశం పట్ల అభిమానాన్ని చూపడం ఒక్క రోజుకే పరిమితం చేయకూడదు. మాతృభూమికి సేవ చేయాలన్న తపన నిత్యమూ కలిగివుండాలి. ఈ ఆగస్టు 15ను వినూత్నంగా జరుపుకోవాలని భావించేవారి కోసం... చుట్టుపక్కల శుభ్రం చేసి కొత్త మొక్కలు నాటండి: దేశానికి సేవ చేయాలన్న తపన ఉంటే మొక్కలు నాటడం, దాన్ని పరిరక్షించడం ఎంతో ఉత్తమం. దీని వల్ల వాతావరణంలో ఆక్సిజన్ స్థాయి పెరుగుతుంది. దీంతో పాటు పరిసరాల్లో శుభ్రతను పాటించేలా నలుగురికీ చెప్పి, శుభ్రత కోసం ఓ చెయ్యి వేయండి. వృద్ధాశ్రమానికి వెళ్లండి: కన్నబిడ్డల నిరాదరణకు గురై ఆశ్రమాల్లో ఉంటున్న వృద్ధుల వద్దకు వెళ్లి వాళ్లకు సహాయంగా ఉంటామన్న భరోసాను ఇవ్వండి. ఏదైనా ఒక ఓల్డేజ్ హోంకు చిన్న చిన్న బహుమతులతో వెళ్లండి. వారి కళ్లల్లో తళుక్కున మెరిసే ఆనందాన్ని చూడండి. ఎంత తృప్తిని ఇస్తుందో స్వయంగా అనుభవించండి. అనాథాశ్రమానికి వెళ్లండి: నా అన్న వారు లేక అలమటించే పిల్లలుండే అనాథాశ్రమానికి వెళ్లి అక్కడి పిల్లలతో కాసేపు ఆడుకోండి. వారికి చాక్లెట్లు, బిస్కెట్లు, పుస్తకాలు, బట్టలు ఏవి వీలైతే అవి తీసుకెళ్లండి. వారు దేశానికి భావి పౌరులని చెప్పండి. జీవితంలో ఎలా ఎదగాలో మీకు తోచిన రీతిలో మంచి సలహాలు ఇవ్వండి. ఇది కూడా ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ఉదారంగా ఉండండి: ఇంట్లో ఎన్నో ఉపయోగించని వస్తువులు ఉంటాయి. అవి మరొకరికి ఎంతగానే ఉపయోగపడతాయన్న విషయాన్ని గుర్తెరగండి. పాత దుస్తులు, బొమ్మలు, పుస్తకాలు తదితరాలను డొనేట్ చేయండి. ఇవన్నీ ఉపయోగించే స్థితిలో ఉండాలి సుమా. మీ గ్రూప్ రక్తం అవసరమైన వారి వివరాలు తెలుసుకుని మరీ వెళ్లి రక్తదానం చేయండి. అంతకన్నా ఆనందం మరొకటి ఉండదు.

More Telugu News