: బేరం చేస్తే మరింత జీతం, ఎలా చేయాలంటే..!

మంచి చదువు చదువుకున్నారు. ఉద్యోగం కోసం దరఖాస్తు చేస్తే, ఇంటర్వ్యూకు రమ్మని కబురొచ్చింది. ఇంటర్వ్యూ కూడా సంతృప్తికరంగానే ముగిసింది. మీపట్ల కంపెనీకి నమ్మకం కుదిరింది. ఇక చివరగా వచ్చే టాపిక్... వేతనం గురించి. ఒక ఉద్యోగం నుంచి మరో ఉద్యోగానికి మారుతున్నవారైనా, తొలిసారిగా ఉద్యోగంలో చేరుతున్న వారైనా కొంత బెట్టును ప్రదర్శిస్తూ, ఆఫర్ చేసిన వేతనం సరిపోదన్న భావనలో ఉన్నట్టు కనిపిస్తే, మరింత వేతనం మీ జేబుల్లోకి చేరుతుంది. ఎంతో మంది వేతనం ఆఫర్ దగ్గరకు వచ్చేవరకు ప్రస్తుతానికి అవసరాలకు మించి వేతనం వస్తుంది, సరిపెట్టుకుందామని భావించి, యజమాని టేబుల్ పై కొంత మొత్తాన్ని వదిలి వెళ్లిపోతుంటారని చెబుతారు వర్క్ ప్లేస్ నిపుణులు లెన్ టైలర్. అటువంటి వారిలో ఒకరిగా మిగలవద్దని సలహా ఇస్తున్నారు. తుది ప్యాకేజీని అంగీకరించేముందు మరో చాన్స్ తీసుకోవాలని, ఆ వేతనం చాలదని ఆర్గ్యూ చేసేందుకు ముందుగానే సిద్ధంగా ఉండాలని సూచిస్తున్నారు. మరింత వేతనం ఇచ్చే విషయంలో అదే పోస్టుకు వచ్చిన ఇతరులతో పోలిస్తే మీకున్న అనుభవం, పనిలో నాణ్యత ఉపయోగపడతాయన్న విషయాన్ని గుర్తెరగాలి. ఆ ఉద్యోగం ఇతరులను వదిలి మీకు వచ్చి, వేతనం వరకూ వెళ్లిందంటేనే, మీరు సమర్థులని యాజమాన్యం భావిస్తున్నట్టు అనుకోవచ్చు. వేతనం గురించి ఓ అంకె మీముందుకు రాగానే దాన్ని మనసులో పెట్టుకుని ఎంతవరకూ బేరం సాగించవచ్చన్న విషయమై ఓ అంచనాకు రావాలి. సాధారణంగా 10 నుంచి 20 శాతం వరకూ అదనపు వేతనం కోసం బేరం చేయవచ్చు. అంటే, మీకో 20 వేల రూపాయల వేతనాన్ని ఆఫర్ చేస్తే, 22 నుంచి 24 వేల రూపాయల వరకూ బేరమాడొచ్చు. ఒకవేళ మీరు ఊహించిన దానికన్నా, అంటే అదే తరహా పోస్టుకు ఉద్యోగులు పొందుతున్న వేతనం కన్నా తక్కువ ఆఫర్ ముందుకోస్తే (ఈ విషయాన్ని ముందే తెలుసుకుని ఇంటర్వ్యూకు వెళ్లగలిగితే మంచిది) మీరు ఆ వేతనానికన్నా అధికంగా అడగగలగాలి. ఒకవేళ ఒక కంపెనీని వదిలి వస్తుంటే, కనీసం 20 శాతం ఎక్కువ ఎక్స్ పెక్ట్ చేస్తున్నానని, అది లేకుంటే ఉద్యోగం చేయలేనని చెప్పాలి. ఇలా చేస్తే కంపెనీ యాజమాన్యం అత్యధిక సందర్భాలలో ఉద్యోగార్థి అభ్యర్థనను మన్నించే అవకాశాలు ఉంటాయి. ఒక్కో సందర్భంలో దాన్ని తిరస్కరించే ప్రమాదమూ ఉంటుంది సుమా...అందుకని అన్నీ ఆలోచించుకుని బేరమాడండి!

More Telugu News