: చేతి గోళ్లను బట్టి ఏ వ్యాధి వస్తుందో చెప్పేయొచ్చు...!

చేతి గోళ్లు మన ఆరోగ్యానికి ముఖసూచికలు అని ఎవరైనా స్నేహితుడు చెబితే...నవ్వి 'వీడు మరీ ఎక్కువ చేస్తున్నాడురా' అంటాం. కానీ అది నిజం. మన చేతి గోళ్లను చూసి మనకు ఏ రకమైన జబ్బు వచ్చే అవకాశముందో చెప్పవచ్చని నిపుణులు చెబుతున్నారు. గోళ్ల రంగు, ఆకృతిని బట్టి ఆరోగ్యం తెలుసుకోవచ్చని వారు సూచిస్తున్నారు. గోటి ద్వారా గుర్తించే వ్యాధుల గురించి నిపుణులు ఏం చెబుతున్నారంటే... కొంత మందికి గోళ్లు పెరిగి వాటంతట అవే విరిగిపోతుంటాయి. ఇలాంటి వారికి కాల్షియం, విటమిన్ డి లేదా జింక్ లోపం ఉందని గ్రహించవచ్చు. వీరు కొవ్వు తక్కువ శాతం ఉన్న పాలపదార్థాలు, చేపలు వంటి వాటిని తినడం ద్వారా కాల్షియం, విటమిన్ డి, జింక్ సమకూర్చుకోవచ్చని వారు సూచిస్తున్నారు. మరికొంత మందికి గోళ్లు పెరగవు, కొన్ని సార్లు పెరిగినా పాలిపోయినట్టు ఉంటాయి. ఇలాంటి గోళ్లు గల వారికి రక్తహీనత, పోషకాహార లోపం ఉందని గ్రహించాలి. దీని వల్ల గుండె లేదా కాలేయానికి సంబంధించిన వ్యాధుల బారిన పడే ప్రమాదముందని నిపుణులు సూచిస్తున్నారు. ఇంకొందరి గోళ్లు మందంగా పసుపు రంగులో, నెమ్మదిగా పెరుగుతుంటాయి. ఇలాంటి గోళ్లు గలవాళ్లు ఊపిరితిత్తుల వ్యాధుల బారినపడే ప్రమాదం ఉందని చెబుతున్నారు. వీరు విధిగా ధైరాయిడ్ పరీక్షలు చేయించుకోవాలని కూడా హెచ్చరిస్తున్నారు. గోళ్లు తెల్లగా ఉన్నా లేక గోళ్ల మధ్యలో తెల్లని చారలు కనిపిస్తున్నా లివర్ కి సంబంధించిన వ్యాధుల బారిన పడే ప్రమాదముందని గ్రహించాలని వారు చెబుతున్నారు. లేదంటే హైపటైటిస్ వ్యాధి బారినపడే ప్రమాదం ఉందని వారు చెబుతున్నారు. గోళ్లు నీలం రంగులో ఉంటే శరీరానికి తగినంత ఆక్సిజన్ లభించడం లేదని భావించాలని నిపుణులు సూచిస్తున్నారు. గోళ్లు అలా మారితే ఊపిరితిత్తులు, గుండె సంబంధమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇకపై మీ గోళ్లను ఓ సారి పరీక్షగా చూసుకుని వ్యాధులు దరి చేరకుండా చూసుకోండి!

More Telugu News