: విండోస్ 10 నచ్చలేదా? ఇలా చేస్తే విండోస్ 7 లేదా 8.1కు వెళ్లవచ్చు!

సరికొత్త ఫీచర్లతో ఇటీవల విడుదలైన 'విండోస్ 10' వర్షన్ ను మీరు వాడుతున్నారా? మీ అవసరాలకు తగ్గ ఆపరేటింగ్ సిస్టమ్ ఇది కాదని భావిస్తున్నారా? తిరిగి పాత వర్షన్ లకు మారిపోవాలని అనుకుంటున్నారా? అది సులభమే. మీరు విండోస్ 7 లేదా విండోస్ 8.1 వర్షన్ల నుంచి అప్ గ్రేడ్ అయివుంటే, తిరిగి డౌన్ గ్రేడ్ కావడం సులభమంటున్నారు టెక్ నిపుణులు. గడచిన 30 రోజుల్లో మీరు విండోస్ 10కు మారిపోయి ఉంటే, తిరిగి పాత వర్షన్ కు ఎలా వెళ్లవచ్చంటే... * 'స్టార్ట్ మెనూ' ఓపెన్ చేసి 'సెట్టింగ్స్'లోకి వెళ్లాలి. * 'సెట్టింగ్స్'లో 'అప్ డేట్ అండ్ సెక్యూరిటీ' ఎక్కడుందో చూడండి * ఆపై 'రికవరీ' ఆప్షన్ పై క్లిక్ చేయండి * గో బ్యాక్ టు విండోస్ 7 లేదా గో బ్యాక్ టూ విండోస్ 8.1 పై క్లిక్ చేయండి * చివరిగా 'గెట్ స్టార్టెడ్' బటన్ నొక్కితే, తిరిగి మీరు పాత వర్షన్ కు వెళ్లిపోతారు. ఇక్కడ ఎందువల్ల మీరు తిరిగి పాత వర్షన్ కోరుకుంటున్నారన్న ప్రశ్న ఉదయిస్తుంది. దీనికి అక్కడే ఉన్న కారణాలు లేదా మీ వర్షన్ చెప్పి 'నెక్ట్స్' బటన్ నొక్కితే సరిపోతుంది. ఒకవేళ మీరు విండోస్ 10కు అప్ గ్రేడ్ అయి 30 రోజులు దాటి వుంటే, బూటబుల్ డీవీడీ ద్వారా తిరిగి వెనక్కు వెళ్లవచ్చు. ఇందుకోసం డీవీడీ ప్లేయర్ లేదా యూఎస్బీ డ్రైవ్ లో విండోస్ 7 లేదా విండోస్ 8.1 ఫుల్ ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్ వేర్ ను ఉంచి కంప్యూటర్ లేదా ల్యాప్ టాప్ ను రీస్టార్ట్ చేస్తే సరిపోతుంది. ఆపై 'క్లిక్ ఇన్ స్టాల్' బటన్ ప్రెస్ చేసి విండోస్ మీ వర్షన్ ను తిరిగి లోడ్ చేసుకోవచ్చు.

More Telugu News