: ఉత్తర అమెరికాలో అతిపెద్ద హనుమాన్ ఆలయం...ప్రాణప్రతిష్ఠ చేసిన గణపతి సచ్చిదానంద

అమెరికాలో భారతీయ భక్తి భావనలు మరింతగా విస్తరిస్తున్నాయి. ఇప్పటికే అమెరికాలోని పలు నగరాల్లో భారతీయులు తమ ఇష్ట దైవాలకు దేవాలయాలు నిర్మించుకున్నారు. తాజాగా ఉత్తర అమెరికాలో అతిపెద్ద మరకత హనుమాన్ దేవాలయం అక్కడి భక్తులకు అందుబాటులోకి వచ్చింది. దాదాపు 40 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితమైన ఈ ఆలయంలో గణపతి, సుబ్రహ్మణ్య, స్ఫటిక శివలింగ, దత్తాత్రేయ, రాజ రాజేశ్వరి ఆలయాలతో పాటు నవగ్రహ మండపాలున్నాయి. ఈ నెల 18న మొదలైన ఆలయ ప్రతిష్ఠ హోమాలు అవధూత దత్త పీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆధ్వర్యంలో ఈ నెల 23న ముగిశాయి. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ఎన్నారైలు హాజరయ్యారు. ఇక ఆలయ విశిష్టతల విషయానికి వస్తే... ఒక్క పూజాధికాలకు సంబంధించిన ఏర్పాట్లే కాక ఆలయంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లు కూడా ఉన్నాయి. నిత్యాన్నదానం, పిల్లల కోసం జరిగే బాల దత్త తరగతులు, సామూహిక వైద్య సేవ సదుపాయాలు, సాంస్కృతిక కళా కేంద్రం, నిత్య హోమాలకై యాగశాల, బుక్ స్టాల్ తదితరాలను కూడా నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఆలయంలో ప్రతిష్ఠా కార్యక్రమాల అనంతరం మండల పూజలు జరుగుతున్నాయి. వచ్చే నెల చివరిదాకా కొనసాగనున్న ఈ పూజల్లో భాగంగా జూలై 31 వ తేది మధ్యాహ్నం అఖండ హనుమాన్ చాలీసా పారాయణ, మర్నాడు గురు పూర్ణిమ మహోత్సవాలు, ఆ తర్వాత హనుమత్ చరిత్ర, ఆనంద రామాయణ సప్తాహాలు, ఆగస్టు 1న గురుపూర్ణిమ మరియు హనుమాన్ రాగసాగర – ధ్యాన నాద చికిత్సా కచేరిలను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

More Telugu News