: నోకియా సరికొత్త ప్రొడక్టు వచ్చే వారంలో విడుదల... అంతా 'మిస్టరీ'యే!

మొబైల్ ఫోన్ వ్యాపారాన్ని మైక్రోసాఫ్ట్ కు అమ్మేసిన తరువాత నోకియా మరో వినూత్న ఉత్పాదనను మార్కెట్లోకి విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంది. నోకియా టెక్నాలజీస్ లో ఎన్ 1 ట్యాబ్లెట్ ను తయారు చేసిన టీమ్ దీన్ని రూపొందించినట్టు తెలుస్తోంది. లాస్ ఏంజిలస్ లో వచ్చే వారం జరగనున్న ఈ ప్రొడక్టు ఆవిష్కరణకు ఎంపిక చేసిన వారికి ఇప్పటికే ఆహ్వానాలు అందాయి. కాగా, ఈ ప్రొడక్టు ఏంటన్న విషయంలో మాత్రం మిస్టరీ నెలకొంది. సంస్థ నుంచి అధికారికంగా ఇప్పటివరకూ ఒక్క విశేషం కూడా వెల్లడి కాలేదు. కొన్ని వర్గాల సమాచారం ప్రకారం వర్చ్యువల్ రియాలిటీ ఆధారిత ప్రొడక్టు ఇదని తెలుస్తోంది. ప్రపంచ సాంకేతిక ఉపకరణాల రంగంలో నోకియా తాజా ఉత్పత్తి సంచలనం సృష్టిస్తుందో లేదో మరో వారంలో తెలుస్తుంది. కాగా, శాంసంగ్, మైక్రోసాఫ్ట్, హెచ్ టీసీలతో పాటు ఫేస్ బుక్ సైతం వర్చ్యవల్ రియాలిటీ హెడ్ సెట్లను తయారు చేసే పనిలో ఉన్నాయి. వీఆర్ పేరిట శాంసంగ్, మార్ఫియస్ పేరిట సోనీ, హోలోలెన్స్ పేరిట మైక్రోసాఫ్ట్, ఓక్యులస్ రిఫ్ట్, రీవైవ్ పేరిట హెచ్ టీసీ కంపెనీలు వర్చ్యవల్ రియాలిటీ ఉత్పత్తుల తయారీలో బిజీగా ఉన్నాయి.

More Telugu News