: 40 శాతం వరకూ తగ్గిన ఔషధ ధరలు!

మధుమేహ వ్యాధి గ్రస్తులకు శుభవార్త. మధుమేహాన్ని నియంత్రణలో ఉంచేందుకు వాడే మందుల ధరలపై ఔషధ ధరల నియంత్రణ మండలి ఆంక్షలు విధించింది. మధుమేహంతో పాటు వివిధ రకాల ఇన్ఫెక్షన్లు, బాధా నివారణ ఔషధాలు తదితరాలకు చెందిన 30 రకాల ఫార్ములేషన్స్ పై గరిష్ఠ ధర అవధులను నిర్ణయించింది. నేషనల్ ఫార్మాస్యుటికల్ ప్రైసింగ్ అథారిటీ విడుదల చేసిన ఆదేశాల ప్రకారం, సిప్రోఫ్లోక్సాసిస్ హైడ్రోక్లోరైడ్ (బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లను నివారించే ఔషధం), సిఫోటాక్సైమ్ (యాంటీ బయాటిక్), పారాసెట్మాల్ (శరీర నొప్పులు, జ్వరాన్ని తగ్గిస్తుంది), డాంపెరిడోన్ మరియు మెట్ఫార్మిన్ (టైప్-2 మధుమేహ రోగులు వినియోగించే ఔషధం), అమాక్సిలిన్ ప్లస్ పొటాషియమ్ క్లవులనేట్ (యాంటీ బయాటిక్) తదితరాల ధరలు తగ్గనున్నాయి. ఈ డ్రగ్ ఫార్ములేషన్స్ తో తయారయ్యే వివిధ రకాల మందులను అబాట్, గ్లాక్సో స్మిత్ క్లయిన్, లుపిన్, కాడిలా హెల్త్ కేర్, ఐపీసీఏ, సన్ ఫార్మా తదితరాలు మార్కెటింగ్ చేస్తున్నాయి. నేషనల్ ఫార్మాస్యుటికల్ ప్రైసింగ్ అథారిటీ ఆదేశాల తరువాత, ఈ ఔషధాల ధరలు 5 నుంచి 40 శాతం వరకూ తగ్గనున్నాయి. కాగా, అనలిస్టుల విశ్లేషణల ప్రకారం ఇండియాలో ఔషధ మార్కెట్ సాలీనా రూ. 1,054 కోట్లుగా ఉంది.

More Telugu News