: 29న ‘విండోస్ 10’ గ్రాండ్ ఎంట్రీ... ‘మైక్రోసాఫ్ట్ ఎడ్జ్’ పేరిట కొత్త బ్రౌజర్

మైక్రోసాఫ్ట్ నూతన ఆపరేటింగ్ వెర్షన్ ‘విండోస్ 10’ ఈ నెల 29న గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుంది. ప్రపంచంలోని పలు ప్రధాన నగరాల్లో నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమాల్లో నూతన వెర్షన్ ను ఆవిష్కరించనున్నట్లు మైక్రోసాఫ్ట్ నిన్న ఓ బ్లాగ్ పోస్ట్ లో అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అన్ని ఆపరేటింగ్ సిస్టమ్ ల కన్నా విండోస్ 10 వేగవంతమైనదిగానే కాక సురక్షితమైనదని మైక్రోసాఫ్ట్ అభివర్ణించింది. విండోస్ 7, విండోస్ 8 ఒరిజినల్ వెర్షన్లు వాడుతున్నవారంతా విండోస్ 10ను ఉచితంగానే డౌన్ లోడ్ చేసుకోవచ్చని కూడా ప్రకటించింది. అయితే ఈ ఉచిత ఆఫర్ ఏడాది వరకు మాత్రమేనని కూడా వెల్లడించింది. ఈ నెల 29నే విడుదలవుతున్నా, విండోస్ 10 వెనువెంటనే వినియోగదారులకు అందుబాటులోకి రాదట. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ తయారీలో కీలక పాత్ర పోషించిన టెస్టర్లకు మాత్రమే దీనిని తొలుత అందుబాటులో ఉంచుతారు. మిగిలినవారికి క్రమంగా అందుబాటులోకి వస్తుంది. జులై 29 తర్వాత కంప్యూటర్లు కొనుగోలు చేసేవారికి ప్రాధాన్యమివ్వనున్నట్లు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. నూతన వెర్షన్ లో స్టార్ట్ మెనూను జోడించిన మైక్రోసాఫ్ట్, ‘మైక్రోసాఫ్ట్ ఎడ్జ్’ పేరిట సరికొత్త బ్రౌజర్ ను పొందుపరిచింది. ఇక మనం తరచూ అడిగే ప్రశ్నలకు సమాధానమిచ్చేందుకు ఇందులో ‘కోర్టానా ప్రోగ్రామ్’ పేరిట ప్రత్యేక వ్యవస్థ కూడా అందుబాటులో ఉంటుందట.

More Telugu News