: ఆంధ్రా ఎంపీలు ఏం చేశారో తెలుసా?...చిట్టా ఇదిగో!: కేశినేని నాని

ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఎంపీలు పార్లమెంటులో ఏం చేస్తున్నారని అడిగే హక్కు పవన్ కల్యాణ్ కు ఉందని ఎంపీ కేశినేని నాని చెప్పారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, తమకు పవన్ కల్యాణ్ మద్దతివ్వడం సరేనని, అయితే అంతకు ముందు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీదే విజయమన్న సంగతి తెలుసుకోవాలని అన్నారు. టీడీపీ ఎంపీలు పార్లమెంటులో ఏం చేస్తున్నారని పవన్ కల్యాణ్ అడిగారని, టీడీపీ ఎంపీలు అక్కడి గోడలు చూడడం లేదని, ఏపీ ప్రజల కోసం కష్టపడుతున్నారని ఆయన చెప్పారు. తనకు ఎంపీ టికెట్ రాక ముందు 18 నెలలు కష్టపడ్డాడని ఆయన తెలిపారు. సుజనా చౌదరి గారు మార్చిలో బడ్జెట్ ముగిసిపోతుంటే, హడావుడిగా కేంద్రం నుంచి 8,500 కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానాకు తీసుకొచ్చారని అన్నారు. అలాగే టీడీపీ నుంచి ఎంపీలుగా గెలవగానే తెలంగాణలో ఉన్న ఏడు ముంపు మండలాలను ఏపీలో కలిపేలా చేశామని వెల్లడించారు. ఏపీకి స్పెషల్ స్టేటస్ కోసం మంత్రుల వద్దకు తిరిగిన వ్యక్తి సుజనా చౌదరి అని అన్నారు. అలాగే కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు గారి వంశం ఏంటి? ఆయన స్థాయి ఏంటి? ఆయనను పవన్ కల్యాణ్ అడగడమేంటని కేశినేని ప్రశ్నించారు. ఆస్తులన్నీ ప్రజలకు ధారబోసి, నిరాడంబర జీవితాన్ని గడిపే అశోక్ గారిని ప్రశ్నించడమా? అని అన్నారు. ఏవియేషన్ మంత్రిగా కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు చేస్తున్నది, ఉన్న విమానాశ్రయాలకు నిధులు కేటాయిస్తోంది ఆయనేనని నాని చెప్పారు. పార్లమెంటులో ఇప్పటి వరకు జరిగిన 36 డిబేట్ లలో పాల్గొన్నానని అన్నారు. తోట నరసింహం 37 సార్లు, అవంతి శ్రీనివాస్ 35 సార్లు, సీఎం రమేష్ 35 సార్లు, రాయపాటి సాంబశివరావు 35 సార్లు, కింజరాపు రామ్మోహన్ నాయుడు 35 సార్లు, సీతామాలక్ష్మి 35 సార్లు డిబేట్లలో పాల్గొన్నారని కేశినేని తెలిపారు.

More Telugu News