: పవన్ కల్యాణ్! పార్టీ పెట్టి ఏం చేశారు? ప్రజల్లోకి రండి తెలుస్తుంది!: కేశినేని నాని

జనసేన పార్టీ పెట్టిన పవన్ కల్యాణ్ ఏం చేశారని టీడీపీ ఎంపీ కేశినేని నాని అడిగారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, పార్టీ అధినేత అనేవాడు ప్రజల్లో ఉంటే ప్రజా సమస్యలు తెలుస్తాయని, చేతనైతే ప్రజల్లోకి రావాలని సవాలు విసిరారు. పవన్ కల్యాణ్ ఆరు నెలలకోసారి మాట్లాడి, మళ్లా నిద్రావస్థలోకెళ్లిపోతే ఎంపీలు ఏం చేశారో ఎలా తెలుస్తుందని ఆయన ఎద్దేవా చేశారు. 'ప్రశ్నిస్తాను, ప్రశ్నిస్తాను' అనే పవన్ కల్యాణ్ ప్రశ్నిస్తే సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని కేశినేని నాని అన్నారు. పవన్ కల్యాణ్ గారెంతో గొప్పవారని, ఆయనకు ఆంధ్రా ప్రజలంటే చాలా ఇష్టమని అనుకున్నానని, అది పొరపాటని ఇప్పుడు అర్థమైందని ఆయన చెప్పారు. కేసీఆర్ లా తిడితే ఆంధ్రాలో పడేవారెవ్వరూ లేరని ఆయన స్పష్టం చేశారు. 'గతంలో కేంద్ర మంత్రిగా ఉన్న మీ అన్నగారు ఏం సాధించారు?' అని ఆయన నిలదీశారు. హైదరాబాదులో 60 లక్షల మంది సీమాంధ్రులుంటే సెక్షన్ 8 వద్దని ఎలా అంటారని ఆయన ప్రశ్నించారు. ఏపీకి చెందిన ప్రభుత్వోద్యోగులపై ప్రాంతీయ విద్వేషాలతో దాడులు చేస్తుంటే సెక్షన్ 8 కావాలని డిమాండ్ చేయాలా? వద్దా? అని ఆయన ప్రశ్నించారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి, మంత్రుల ఫోన్లు ట్యాప్ చేస్తుంటే భద్రత అవసరం లేదా? అని అడిగారు. ఇళ్లు కూల్చేస్తుంటే సీమాంధ్రులు ఎటు పోవాలని ఆయన నిలదీశారు. సెక్షన్ 8 ను మీ అన్నగారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు తెచ్చిన రాష్ట్ర పునర్విభజన బిల్లులో పెట్టినదేనని ఆయన గుర్తు చేశారు. 'మీ ఆస్తులు కాపాడుకునేందుకు, సినిమాలు ఆడించుకునేందుకు సెక్షన్ 8 వద్దని అంటారా?' అని ఆయన సూటిగా ప్రశ్నించారు.

More Telugu News