: భారత్ అభ్యంతరాలను తోసిపుచ్చిన పాకిస్థాన్

పాక్ ఆక్రమిత కాశ్మీర్ గుండా ఏర్పాటయ్యే చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ పట్ల భారత్ అభ్యంతరాలను పాక్ తోసిపుచ్చింది. ఎకనామిక్ కారిడార్ అంశంపై భారత్ స్పందన అనవసరమని, చెప్పాల్సి వస్తే, ఇది పాక్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నట్టేనని ఆ దేశ ఆర్థిక మంత్రి ఇషాఖ్ దార్ అన్నారు. పొరుగు దేశాలన్నింటితో కనెక్టివిటీ పెంపొందించుకునేందుకే తమ ప్రయత్నమని తెలిపారు. ఈ ఎకనామిక్ కారిడార్ ద్వారా భారత్, ఆఫ్ఘనిస్థాన్ వంటి దేశాలు కూడా లబ్ధి పొందుతాయని విశ్వసిస్తున్నట్టు చెప్పారు. ఈ కారిడార్ విషయంలో భారత్ స్పందన ఆశ్చర్యం కలిగించిందని అన్నారు. భారత్ నేతలు, పార్లమెంటు తమ ప్రాజెక్టుపై చురుగ్గా స్పందించినట్టు ఆయన పేర్కొన్నారు. అయితే, ఈ ప్రాజెక్టును సానుకూల దృక్పథంతో చూడడం భారత్ కు మంచిదని తెలిపారు. అలా కాకుండా, ఈ ప్రాజెక్టు ఆమోదయోగ్యం కాదని పేర్కొనడం వారి అపరిపక్వతకు నిదర్శనమని విమర్శించారు. కాగా, చైనాలోని ఝిన్ జియాంగ్ ప్రావిన్స్ నుంచి పీవోకే గుండా పాకిస్థాన్ లోని గ్వదర్ పోర్టు వరకు ఈ ఎకనామిక్ కారిడార్ నిర్మితం కానుంది. అయితే, ఈ ప్రాజెక్టు పాక్ ఆక్రమిత కాశ్మీర్ గుండా ఏర్పాటవడం తమకు ఆమోదయోగ్యం కాదని భారత్ అంటోంది. ఇదే విషయాన్ని చైనా అధినాయకత్వం వద్ద కూడా ప్రధాని మోదీ ప్రస్తావించారు. అందుకు చైనా బదులిస్తూ... ఇది రాజకీయ కారిడార్ కాదని, ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన కారిడార్ అని స్పష్టం చేసింది.

More Telugu News