: 'సిప్రాస్ డిమాండ్స్'ను యూరో జోన్ అంగీకరిస్తుందా?...కుదేలైపోతుందా?

సిప్రాస్ డిమాండ్స్ ను యూరో జోన్ అంగీకరిస్తుందా? లేక కుదేలైపోతుందా? అనే సందేహం ఆర్థిక నిపుణుల్లో ఆసక్తి రేపుతోంది. నేటి సాయంత్రం యూరోజోన్ ప్రతినిధులతో గ్రీస్ ప్రధాని సిప్రాస్ సమావేశం కానున్నారు. గ్రీస్ రెఫరెండమ్ నేపథ్యంలో యూరో జోన్ షరతులను అంగీకరించని సిప్రాస్, రుణాలను 30 శాతానికి తగ్గించాలని డిమాండ్ చేయనున్నారు. అలాగే జోన్ లో కొనసాగాలంటే కొత్త రుణసదుపాయం కల్పించాలని, ప్రజాభిప్రాయానికి అనుగుణంగా వ్యయదాతలు షరతులు మార్చుకోవాలని ఆయన సూచించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన గ్రీస్ జోన్ లో కొనసాగేందుకు మొగ్గుచూపుతుండగా, గ్రీస్ ను యూరో జోన్ లో కొనసాగించేందుకు ఆయాదేశాల కూటమి ప్రయత్నిస్తోంది. అదే సమయంలో యూరో జోన్ ఇచ్చిన భారీ రుణ మొత్తాన్ని ఎలాగైనా వసూలు చేయాలని భావిస్తుండగా, షరతులకు అంగీకరించకుండా కొత్త రుణాలు సాధించుకోవాలని గ్రీస్ భావిస్తోంది. యూరో జోన్ లోని పలు దేశాల నుంచి గ్రీస్ 27 లక్షల కోట్ల యూరోలు అప్పుగా తీసుకున్నట్టు సమాచారం. కాగా, గ్రీస్ జీడీపీలోని 30 శాతం నిధులు పెన్షన్ల చెల్లింపులకే సరిపోతోంది. గ్రీస్ లో ప్రభుత్వోద్యోగులు, వయో వృద్ధులు, నిరుద్యోగులకు పెన్షన్లు అందుతున్నాయి. అలాగే సిటిజన్లకు పలు రాయితీలు అమలులో ఉన్నాయి. దీంతో రుణాలు చెల్లించడం గ్రీస్ కు కత్తిమీది సాముగా మారింది. పెన్షన్లు, రాయితీలకు కోత పెట్టాలని యూరో జోన్ డిమాండ్ చేస్తుండగా, గ్రీస్ ప్రజలు అందుకు అంగీకరించడం లేదు. దీంతో గత రెండు రోజులుగా గ్రీస్ లో బ్యాంకులు తెరుచుకోవడం లేదు. యూరో జోన్ నుంచి గ్రీస్ బయటకు వస్తే, గ్రీస్ తో పాటు యూరో జోన్ కు కూడా తీవ్ర నష్టం వాటిల్లనుంది. జోన్ నుంచి బయటకు వస్తే, అంతర్జాతీయ సమాజంలో కొత్తగా ముద్రితమయ్యే గ్రీస్ కరెన్సీకి విలువ ఉండదు. అదే సమయంలో గ్రీస్ కు భారీ ఎత్తున అప్పులిచ్చిన జర్మనీ వంటి దేశాల ఆర్థిక రంగం తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో యూరోజోన్ ప్రతినిధులతో గ్రీస్ ప్రధాని సిప్రాస్ చర్చలు ఏ దరికి చేరనున్నాయనే ఆసక్తి సర్వత్రా వ్యక్తమవుతోంది.

More Telugu News