: మీ స్మార్ట్ ఫోన్ తో మరింత మంచి ఫోటోలు తీసేందుకు టిప్స్

ప్రస్తుతం ప్రపంచంలో మోస్ట్ పాప్యులర్ కెమెరాలు అంటే స్మార్ట్ ఫోన్లే. వేగంగా ఫోటోలు తీసుకోవడానికి, ఆ వెంటనే వాటిని బంధు మిత్రులతో షేర్ చేసుకోవడానికి ఇవి ఎంతో సహకరిస్తున్నాయి. అయితే, కేవలం 'క్లిక్'మనిపించడంతోనే సరిపెట్టుకోకుండా కొన్ని చిన్న చిన్న టిప్స్ పాటిస్తే ఫోటోలు మరింత అందంగా వస్తాయని నిపుణులు అంటున్నారు. అందుకు ఫోటోగ్రఫీలో నైపుణ్యత ఏమీ అవసరం లేదు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలు. మీ స్మార్ట్ ఫోన్లో మరింత మంచి చిత్రాలను బంధించేందుకు కొన్ని టిప్స్... హెచ్ డీఆర్ మోడ్: మరీ కాంతిమంతంగా లేదా చీకటిగా ఉన్న ప్రాంతాల్లో చిత్రాలు తీయాలంటే హెచ్ డీఆర్ (హై డైనమిక్ రేంజ్) మోడ్ ఉపకరిస్తుంది. చాలా స్మార్ట్ ఫోన్ కెమెరాల్లో ఈ సౌకర్యం అందుబాటులో ఉంది. దీనివల్ల లైటింగ్ ను బ్యాలెన్స్ చేసుకోవచ్చు. చీకటిగా ఉన్న చోట కూడా వెలుగును తెప్పించొచ్చు. బ్యాలెన్స్ మోడ్ ను మారుస్తూ, చిత్రాన్ని రెండు మూడు రకాలుగా తీసి బాగా వచ్చినదాన్ని ఎంచుకోవచ్చు. క్విక్ లాంచ్: కెమెరా యాప్ ను తెరవాలంటే కొంత సమయం పడుతుంది. ప్రతి స్మార్ట్ ఫోన్లోనూ ఉన్న సమస్యే ఇది. ముఖ్యంగా ఫోన్ 'లాక్' చేసి వుంటే కెమెరా యాప్ తెరచుకోవడానికి మరింత సమయం పడుతుంది. దీనివల్ల ముఖ్యమైన దృశ్యం మిస్ కావచ్చు. కెమెరా యాప్ ను హోం స్క్రీన్ పై పెట్టుకోవడం ద్వారా కొంత సమయాన్ని ఆదా చేసుకోవచ్చు. శాంసంగ్ గెలాక్సీ తదితర ఫోన్లలో హోం బటన్ ను రెండు సార్లు తాకడం ద్వారా కెమెరా యాప్ ఓపెన్ అవుతుంది. ఈ తరహా షార్ట్ కట్స్ చాలా ఫోన్లలో ఉన్నాయి. వాటిని వాడండి కెమెరా బటన్: మరో టిప్ ఏంటంటే... కెమెరా కోసమే ప్రత్యేకంగా ఉన్న బటన్ వాడడం ద్వారా 'సీన్' మిస్ కాకుండా చిత్రాలు తీయొచ్చు. ఈ బటన్ వాడడం ద్వారా చేతులు స్థిరంగా ఉంటాయి. దీంతో షేకింగ్ సమస్య కూడా తీరుతుంది. స్మార్ట్ ఫోన్ సెట్టింగ్స్ నుంచి కెమెరా షట్టర్ బటన్ గా వాల్యూమ్ కీస్ ఉపయోగించుకునేలా మార్చుకునే సదుపాయం ఉంది. లైట్: కాంతి లేకుంటే ఏ చిత్రమూ అందంగా కనిపించదు. సూర్యోదయం, సూర్యాస్తమయం వంటి ప్రకృతి దృశ్యాల చిత్రీకరణ మినహాయిస్తే, మిగతా అన్ని సందర్భాల్లో లైటింగుకు ఎంతో ప్రాధాన్యముంది. పొగమంచు పట్టి వున్నా, లైటింగ్ తక్కువ ఉన్నా మరింత మంచి చిత్రాలు రావాలంటే, కాంతి ఎటువైపు నుంచి వస్తున్నదో తెలుసుకుని దానికి అభిముఖంగా ఉన్న చిత్రాలు తీస్తే మంచి ఫలితాలు వస్తాయి. కన్నే కెమెరా: ఒక్కసారి చుట్టూ చూడండి. మీ కోసం ఓ అద్భుత ఫోటోగ్రాఫ్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. దాన్ని మన కన్ను గుర్తించడమే అసలు సమస్య. అంటే ఫ్రేమ్ కంపోజ్. దీనికి సంప్రదాయ 'రూల్ ఆఫ్ థర్డ్' పద్ధతిని ప్రముఖ ఫోటోగ్రాఫర్లు వినియోగిస్తారు. చాలా స్మార్ట్ ఫోన్లలో గ్రిడ్ వ్యూ ఉంటుంది. దీన్ని తెరిస్తే స్క్రీన్ పై నిలువు, అడ్డు గీతలు వస్తాయి. వీటి సాయంతో, చిత్రం తీయాలనుకున్న వస్తువు, వ్యక్తి ఏ ప్రాంతంలో ఉన్నాడు... అంటే ఏ గ్రిడ్ లో వస్తున్నాడో సులువుగా తెలుస్తుంది. దీన్ని బట్టి సదరు వ్యక్తి లేదా వస్తువును మరింత ఆకట్టుకునే రీతిలో 'క్లిక్'మనిపించవచ్చు. మన కన్ను, కెమెరా కన్నూ ఒకటేనన్న విషయాన్ని గుర్తుంచుకొని, కంటికి ఇంపైన దానిపై కెమెరా కన్నును సారిస్తే చిత్రాలు అద్భుతాలవుతాయి. క్లిక్ కొట్టే సమయం: ఇక చివరిగా క్లిక్ మనిపించే సమయం. ఇది చాలా ముఖ్యమైన అంశం. ఎంతో ఓపిక కూడా అవసరమే. ముఖ్యంగా ఓ పర్టికులర్ మూమెంట్ ను ట్రాప్ చేయాలంటే చాలా కష్టంతో కూడుకున్నది. కాస్త కష్టపడి, ఆ ఒక్క సెకనూ మిస్ కాకుండా ఉండగలిగితే, మీలోని ఫోటోగ్రాఫర్ బయటకు వచ్చినట్టే.

More Telugu News