: 4 కిలోల 'పసిడి చొక్కా'...హిమాయత్ నగర్ లో సందడి చేసిన ముంబైవాలా!

నిన్న హైదరాబాదులోని హిమాయత్ నగర్ లో జరిగిన ఓ గృహ ప్రవేశం వేడుకలో 'బంగారు చొక్కా' దర్శనమిచ్చింది. మహారాష్ట్ర రాజధాని ముంబైకి చెందిన వ్యాపారి ఏకంగా నాలుగు కిలోల బంగారంతో పసిడి చొక్కా కుట్టించుకున్నారు. అంతేకాదు, పసిడి ప్యాంట్ ను కూడా కుట్టించుకుంటున్నట్లు వెల్లడించి ఆయన అందరినీ ఆశ్చర్యపరిచారు. చిన్నప్పటి నుంచి బంగారం అంటే ఆసక్తి అని ప్రకటించిన ఆయన బంగారు బూట్లను కూడా చేయించుకున్నారట. వివరాల్లోకెళితే... హిమాయత్ నగర్ కు చెందిన వ్యాపారి ప్రదీప్ పరేఖ్ సోదరుడు, ముంబైలో వ్యాపారం చేస్తున్న పంకజ్ పరేఖ్ నిన్న సోదరుడి ఇంట జరిగిన గృహప్రవేశంలో పసిడి చొక్కాతో సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. ఈ సందర్భంగా పంకజ్ మీడియా వేసిన పలు ప్రశ్నలకు తాపీగా సమాధానమిచ్చారు. ‘‘చిన్నప్పటి నుంచి బంగారం అంటే నాకెంతో మమకారం. అందుకే టీనేజీ నాటి నుంచి నిత్యం నా ఒంటిపై మూడు కిలోలకు తక్కువ కాకుండా బంగారం ఉంటోంది. నా ఆసక్తిని గమనించిన స్నేహితులు పసిడి చొక్కా గురించి ప్రస్తావించారు. ఇదేదో బాగుందనుకుని నాలుగు కిలోల బంగారంతో చొక్కాను కుట్టించుకున్నాను. పుత్తడిని వస్త్రంగా తయారు చేసేందుకు ఆరు నెలల సమయం పట్టగా, ఆ వస్త్రాన్ని చొక్కాగా కుట్టేందుకు రెండు నెలల సమయం పట్టింది. ఇక పసిడి ప్యాంట్ ను కూడా సిద్ధం చేసుకుంటున్నాను. బంగారంతో చేసిన బూట్లు కూడా నాకున్నాయి’’ అని ఆయన చెప్పారు. ఇక పసిడి చొక్కాతో మెరిసిపోయిన పంకజ్ మేనిపై నిన్న ఉన్న బంగారం బరువెంతో తెలుసా? అక్షరాలా ఏడు కిలోల బంగారంతో ఆయన నిన్న మెరిసిపోయారు!

More Telugu News