: ఆనందం పట్టలేకపోయిన పాక్ మాజీ ప్రధాని

పాకిస్థాన్ మాజీ ప్రధాని యూసఫ్ రజా గిలానీ ఆనందం పట్టలేకపోయారు. ఆయన ఆనందానికి కారణం ఒక కొత్త ఫోన్ నెంబర్ నుంచి ఆయన ఫోన్ కు కాల్ రావడమే. కొత్త నెంబర్ నుంచి కాల్ రావడంతో ఆలోచిస్తూనే ఫోన్ ఎత్తినా, అవతలి గొంతు వినగానే ఆనందం పట్టలేకపోయానని గిలానీ చెప్పారు. కారణం రెండేళ్ల క్రితం కిడ్నాపైన గిలానీ కుమారుడు ఫోన్ లో మాట్లాడడమే! యుసఫ్ రజా గిలానీ కుమారుడు అలీ హైదర్ ను 2013లో తెహ్రిక్ ఈ తాలిబాన్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. దీంతో భద్రతా దళాలు ఎంత వెతికినప్పటికీ అతని ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. కిడ్నాపైన నాటి నుంచి అతడు ఏమైపోయాడు? ఎక్కడున్నాడు? అనే విషయాలు తెలియలేదు. రెండేళ్ల తరువాత ఉన్నట్టుండి, హైదర్ నుంచి ఫోన్ రావడంతో గిలానీ ఆనందంతో ఉప్పొంగారు. తాను బాగానే ఉన్నానని, మీరు, మన కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారని హైదర్ అడిగాడని ఆయన చెప్పారు. ఎనిమిది నిమిషాలపాటు తన కుమారుడితో మాట్లాడానని, హైదర్ సురక్షితంగా తిరిగొస్తాడన్న నమ్మకం తనకు ఉందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. కాగా, హైదర్ ను కిడ్నాప్ చేసిన ఉగ్రవాదులు జైల్లో ఉన్న తమ అగ్ర నేతలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారని, వారిలో కొందరని ఇప్పటికే వదిలేశారని ఆయన తెలిపారు. తాలిబన్లు మాట తప్పారని, చెప్పిన ప్రకారం తన కుమారుడ్ని వదల్లేదని ఆయన చెప్పారు. కాగా, సంకెళ్లతో బంధించి ఉన్న హైదర్ వీడియోను తాలిబన్లు పాక్ ప్రభుత్వానికి ఈ మధ్య పంపించారు.

More Telugu News