: ప్రవాస భారతీయులకు ఉగ్ర సంస్థల ఎర

ఐఎస్ఐఎస్, ఐఎస్ఐఎల్ తదితర ఉగ్రవాద సంస్థలు ప్రవాస భారతీయులను జీహాదీలుగా చేర్చుకుంటున్నాయని ఎన్ఐఏ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ) వెల్లడించింది. ఇరాక్, సిరియా వాసులనే కాకుండా భారత్ తదితర దేశాల వాసులకు ఉగ్రసంస్థలు ఎర వేస్తున్నాయని ఐఎస్ఐఎల్ (ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ లెవాంత్) సభ్యుడు అరీబ్ మాజిద్ పై వేసిన చార్జ్ షీటులో ఎన్ఐఏ తెలియజేసింది. మొత్తం 8,500 పేజీల చార్జ్ షీటులో మాజిద్, ముంబైకి చెందిన అతని ముగ్గురు స్నేహితులు ఫర్హాద్ షేక్, అమన్ తండీల్, షహీమ్ తాంకీలు ఐఎస్ఐఎస్ లో చేరాలని భావించి నేరం చేశారని వివరించింది. జనవరి 2014లో మాజిద్ ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ గురించి ఇంటర్నెట్ లో తెలుసుకుని ఆకర్షితుడయ్యాడని పేర్కొంది. ఆపై మిగిలిన ముగ్గురి మనసునూ మార్చాడని తెలిపింది. ఈ నలుగురూ ఓ టూర్ ఆపరేటర్ ద్వారా యాత్రికుల మాదిరిగా తొలుత బాగ్దాద్ వెళ్లారని, ఎవరూ తమ ప్రయాణం, అసలు ఉద్దేశాలను ఇంట్లోని వారికి చెప్పలేదని వివరించింది. మే 31న నలుగురూ మోసుల్ చేరుకున్నారని, 10 నుంచి 12 రోజుల పాటు జజీరాలో ఉగ్రవాద శిక్షణ తీసుకున్నారని తెలిపింది. శిక్షణ తరువాత అమన్ మినహా మిగిలిన ముగ్గురూ ఆత్మహత్యా దళంలో చేరారని, ఇండియాలో ఉగ్రదాడికి పథకం వేసుకున్న మాజిద్ ఇస్తాంబుల్ చేరి తన పాస్ పోర్టు పోయిందని దౌత్య కార్యాలయంలో చెప్పాడని, అతనికి ఇండియా వెళ్లేందుకు సర్టిఫికెట్ ఇచ్చారని వెల్లడించిన ఎన్ఐఏ, అతన్ని విమానాశ్రయంలో అధికారులు అరెస్ట్ చేసి ఇండియాకు అప్పగించారని తెలిపింది.

More Telugu News