: ఉద్యోగాల సృష్టిలో మెట్రోల కన్నా చిన్న పట్టణాలే నయం!

కొత్త ఉద్యోగాల సృష్టి, స్వయం ఉపాధి విషయాల్లో మెట్రోలతో పోలిస్తే చిన్న పట్టణాలే ముందంజలో ఉన్నాయని తాజాగా వెల్లడైన నివేదిక ఒకటి పేర్కొంది. నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ (ఎన్ఎస్ఎస్ఓ) నిర్వహించిన సర్వే ప్రకారం 50 వేల లోపు జనాభా ఉన్న క్లాస్-3 పట్టణాలలో 45 శాతం మంది పురుషులు, 50 శాతానికి పైగా మహిళలు స్వయం ఉపాధిని పొందుతున్నారు. ఇదే సమయంలో నగరాల్లో స్వయం ఉపాధిని పొందుతున్న వారి శాతం 36 నుంచి 38 శాతం మాత్రమే. నగరాల్లో కొత్త పరిశ్రమల ఏర్పాటు నిదానించడం, ఇదే సమయంలో చిన్న చిన్న పట్టణాల్లో ఉత్పత్తి కర్మాగారాలు వెలుస్తుండడంతో ఉపాధి సులువుగా లభిస్తోందని సర్వే నివేదిక వెల్లడించింది. 2004-05తో పోలిస్తే స్వయం ఉపాధి పొందుతున్న వారి సంఖ్య తగ్గగా, వేతనాలు లభించే ఉద్యోగాల సంఖ్య పెరిగింది. పది లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాల్లో దశాబ్ద కాలం క్రితం 50 శాతానికి లోపుగా ఉన్న వేతన జీవుల సంఖ్య ఇప్పుడు 55 శాతానికి పైగా చేరుకుంది. చిన్న పట్టణాల్లో మహిళలకు సులువుగా ఉద్యోగాలు లభిస్తున్నాయని కూడా సర్వే వెల్లడించింది.

More Telugu News