: నేడు తిరుమలలో సామాన్యులకు మాత్రమే దర్శనం... లక్ష రికార్డు అందుకునేనా?

తిరుమలలో నేడు వీఐపీ, బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్టు టీటీడీ వెల్లడించింది. అత్యధిక సంఖ్యలో భక్తులు క్యూలైన్లలో వేచి ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ఈవో వెల్లడించారు. శ్రీవారి దర్శనం కోసం వైకుంఠం క్యూకాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లన్నీ నిండిపోగా, కొండపైకి చేరుకుంటున్న భక్తుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ఇప్పటికే దర్శనం కోసం 70 వేల మంది వరకూ ఎదురుచూస్తున్నారు. వీరికి తోడు ముందస్తుగా 300 రూపాయల టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులు సుమారు 10 వేలకు పైగానే ఉన్నారు. వీరికి అదనంగా, వివిధ జిల్లాల్లోని టీటీడీ కౌంటర్ల ద్వారా సుదర్శనం టోకెన్లు తీసుకున్నవారు కూడా దర్శనం నిమిత్తం వస్తుండడంతో నేడు శ్రీవారిని దర్శనం చేసుకునే భక్తుల సంఖ్యలో కొత్త రికార్డు నమోదవుతుందని భావిస్తున్నారు. గత శనివారం నాడు 90 వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్న సంగతి తెలిసిందే. నేడు వీఐపీ, బ్రేక్ దర్శనాలు రద్దు కావడంతో ఆ సంఖ్య లక్ష మార్క్ దాటే అవకాశాలున్నాయి.

More Telugu News