: మూడో భూకంపం... తీవ్రత 5.7... నేపాల్ లో శిథిలాల కింద వందలాది మంది!

గంటన్నర వ్యవధిలో మూడో భూకంపం నమోదైంది. దీని కేంద్రం కూడా నేపాల్ లోనే ఉన్నట్టు సమాచారం. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.7గా నమోదైంది. కాగా, నేపాల్ లోని పలు ప్రాంతాల్లో పాత భవంతులు కుప్పకూలగా వందలాది మంది శిథిలాల కింద చిక్కుకుపోయారని తెలుస్తోంది. వీరిలో పలువురు మృతిచెంది ఉంటారని సమాచారం. భవనం కూలి 15 ఏళ్ల బాలిక మృతి చెందినట్టు వార్తలు వెలువడ్డాయి. ఖాట్మండులోని ఆసుపత్రులకు వందలాది మంది క్షతగాత్రులు చేరుకుంటున్నారు. నేపాల్ లోని చాలా ప్రాంతాల్లో భీతావహ పరిస్థితులు నెలకొన్నాయి. దేశవ్యాప్తంగా సెల్ ఫోన్ సేవలు నిలిచిపోగా, చాలా ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు కూలి కరెంట్ సరఫరాకు అంతరాయం ఏర్పడినట్టు అధికారులు తెలిపారు. భూకంప తీవ్రత పాత ఖాట్మండులోని హనుమాన్ డోక ప్రాంతంలో అధికంగా ఉంది. పలు ప్రముఖ ఆలయాలు, చారిత్రక కట్టడాలు కుప్పకూలాయి. ఇక్కడి ధరారా టవర్ కుప్పకూలగా, కనీసం 400 మంది చిక్కుకున్నట్టు తెలిసింది.

More Telugu News