: ప్రత్యేక హోదా అంశంపై కేంద్రం తీరు పట్ల ఏపీ నేతల ఫైర్!

ఏపీకి ప్రత్యేక హోదా కష్టమేనంటూ కేంద్రం పేర్కొనడంపై ఆయా పార్టీల నేతలు స్పందించారు. టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమ మాట్లాడుతూ... కేంద్రం లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానం ఏపీ ప్రజలను షాక్ కు గురిచేసిందన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రానిదేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేత ద్రోణంరాజు శ్రీనివాస్ ప్రత్యేక హోదా కోసం ఏపీ నేతలంతా పార్టీలకు అతీతంగా ఏకం కావాలని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే, కాంగ్రెస్ పోరాటం చేస్తుందని తెలిపారు. ఇక, వామపక్షాలు కూడా ఈ అంశంపై తమ స్వరం వినిపించాయి. సీపీఐ నేత రామకృష్ణ మాట్లాడుతూ... విభజన వేళ ఏపీకి అన్యాయం జరుగుతుందని ఢిల్లీ వెళ్లి దీక్షలు చేసిన చంద్రబాబు ఇప్పుడు ప్రత్యేక హోదా అంశంపై మౌనం వీడాలని అన్నారు. సీపీఎం నేత మధు బీజేపీ వైఖరిని తప్పుబట్టారు. బీజేపీది ద్వంద్వ వైఖరి అని దుయ్యబట్టారు. వాస్తవానికి ప్రత్యేక హోదా ఇవ్వడం బీజేపీకి ఇష్టంలేదని, అందుకు సాంకేతిక కారణాలను సాకుగా చూపుతోందని అన్నారు. రాజ్యాంగ సవరణ ద్వారా హోదా ఇచ్చే అవకాశం ఉన్నా, బీజేపీ, టీడీపీ పచ్చి అవకాశవాదంతో వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. అటు, ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై స్పష్టతనివ్వకపోవడంపై విజయవాడలో కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. మాజీ శాసనసభ్యుడు మల్లాది విష్ణు ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. చంద్రబాబు ఇకనైనా కేంద్రంతో పోరాటానికి సిద్ధం కావాలని విష్ణు డిమాండ్ చేశారు. కేంద్రం అసలు రంగు బయటపడిందన్నారు.

More Telugu News