: 17 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా సోనియా గాంధీ రికార్డు!

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిలో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న నేతగా సోనియా గాంధీ రికార్డు సృష్టించారు. 17 ఏళ్లుగా ఆమె ఏఐసీసీ అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. రాజీవ్ గాంధీ హత్య తర్వాత కొంతకాలం పాటు పార్టీ కార్యకలాపాలకు దూరంగానే ఉన్న సోనియా గాంధీ, 1997లో తప్పనిసరిగా పార్టీలో క్రియాశీలకంగా మారాల్సి వచ్చింది. ఆ ఏడాది కోల్ కతాలో జరిగిన పార్టీ ప్లీనరీలో ప్రాథమిక సభ్యత్వం తీసుకున్న సోనియా గాంధీ, కేవలం 62 రోజులకే 1998లో పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి 17 ఏళ్లుగా ఆమె ఆ బాధ్యతల్లో కొనసాగుతున్నారు. పార్టీలో ఇంతకాలం పాటు అధ్యక్ష పదవిలో కొనసాగిన మరో నేత లేరు. పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన మరుసటి ఏడాదే ఆమె ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగారు. 1999లో గాంధీ కుటుంబాల సొంత నియోజకవర్గం రాయబరేలీతో పాటు కర్ణాటకలోని బళ్లారి లోక్ సభ సీటు నుంచి పోటీకి దిగిన ఆమె, రెండు చోట్లా విజయం సాధించారు. బీజేపీ సీనియర్ నేత, ప్రస్తుత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ను సోనియా గాంధీ బళ్లారిలో మట్టి కరిపించారు. ఇదిలా ఉంటే, సుదీర్ఘకాలం పాటు పార్టీ అధ్యక్ష బాధ్యతలను మోస్తూ వస్తున్న సోనియా గాంధీ, ఈ ఏడాది ఆ బాధ్యతలను తన కొడుకు, పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి అప్పగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

More Telugu News