: రాయలసీమకు వరప్రదాయిని పట్టిసీమ: బాబు

రాయలసీమకు మరింత నీరు రావడానికే పట్టిసీమ ప్రాజెక్టును ప్రారంభించినట్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి నేటి మధ్యాహ్నం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ, మరో నాలుగేళ్ళలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. అంతకన్నా ముందే పట్టిసీమ పూర్తి చేసి ఆ నీటిని కృష్ణా, గుంటూరు జిల్లాలకు అందించడం ద్వారా కృష్ణా నది నీటిని ఆదా చేసి, శ్రీశైలం ప్రాజెక్టు నుంచి మరింత నీరు రాయలసీమకు తరలిస్తామని తెలిపారు. రాయలసీమను రతనాల సీమగా మరోసారి నిలిపేందుకు ఈ ప్రాజెక్టు ఉపకరిస్తుందని వివరించారు. రూ. 1300 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ప్రాజెక్టు పూర్తి అయితే మొత్తం 8 లక్షల ఎకరాలకు నీరు అందుతుందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుతో సీమ కరవును దూరం చేస్తామని హామీ ఇచ్చారు. కాగా, నేడు ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు పుట్టినరోజు కావడంతో వేదిక పైనే ఆయనతో కేక్ కట్ చేయించారు. పలువురు నేతలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

More Telugu News