: 120 ఏళ్లు బతకడం సాధ్యమే: గూగుల్ డైరెక్టర్

మానవ జీవనకాలాన్ని 120 ఏళ్ల వరకు పెంచడం సాధ్యమని గూగుల్ ఇంజనీరింగ్ విభాగం డైరెక్టర్ రే కుర్జెవీల్ తెలిపారు. బ్లూమ్ బెర్గ్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, క్షీణించిన మానవ అవయవాల స్థానంలో త్రీడీ టెక్నాలజీ సాయంతో కృత్రిమ అవయవాలను అమర్చడం ద్వారా జీవన కాలం పెంచడం సాధ్యమవుతుందని అన్నారు. ఇది కార్యరూపంలో రావడానికి ఎంతో కాలం పట్టదని, ఈ శతాబ్దంలోనే జరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. 500 ఏళ్లు బతకవచ్చు అన్న గూగుల్ వెంచర్ హెడ్ బిల్ మారిస్ అభిప్రాయంతో ఆయన విభేదించారు. కాగా, ఎలాంటి కృత్రిమ అవయవాల అవసరం లేకుండానే శాస్త్రవేత్తలు ‘సీ ఎలిగాన్’ అనే ఓ రకం క్రిమి జీవితకాలాన్ని ల్యాబరేటరీలో ఐదింతలు పెంచడంలో విజయం సాధించారు. ఆ క్రిమి జెనెటిక్ కోడ్ ను పూర్తిగా మ్యాపింగ్ చేయడం ద్వారా ఇది సాధ్యమైందని, మానవుడి జెనెటిక్ కోడ్‌ను కూడా పూర్తిగా మ్యాపింగ్ చేస్తే, మానవ ప్రామాణిక జీవనకాలాన్ని నాలుగైదు రెట్లు పెంచవచ్చని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.

More Telugu News