: బికినీ... ఓ దీవి పేరట!

రెండు చిన్నపాటి గుడ్డ ముక్కలతో ఆడవాళ్ల కోసం చేసిన స్విమ్ సూట్ బికినీ, ఎప్పుడూ సెన్సేషనే. సంప్రదాయానికి అధిక ప్రాధాన్యమిచ్చే మన దేశంలో ఆ గుడ్డముక్కల దుస్తులు ఎప్పుడూ సంచలనమే. అయితే ఆ గుడ్డపీలికలకు బికినీ అనే పేరెలా వచ్చిందనే దాని వెనుక పెద్ద కథే ఉంది. మనకు స్వాతంత్ర్యం రాకమునుపే పాశ్చాత్య దేశాల్లో వాడుకలో ఉన్న బికినీ వినియోగం, 1940 దశకం తర్వాత యూరోపియన్ దేశాల్లో విస్తృతమైందట. ఫ్రాన్స్ మహిళల కోసం ఆ దేశ కాస్ట్యూమ్స్ డిజైనర్ జాక్వెమ్ హీమ్ తొలుత రెండు గుడ్డ ముక్కల ఈత దుస్తులను రూపొందించి, దానికి ‘ఆటోమ్’ అనే పేరు పెట్టాడు. అత్యంత చిన్న బాతింగ్ సూట్ గా దానిని ఆయన ప్రచారం చేశాడు. ఈ క్రమంలో 1946లో పసిఫిక్ మహాసముద్రంలోని ఓ చిన్న దీవి ‘బికినీ అటాల్’లో అమెరికా అణు పరీక్ష నిర్వహించింది. దీంతో నాడు ఈ దీవి పేరు విశ్వవ్యాప్తంగా మారుమోగింది. ఫ్రాన్స్ కే చెందిన మరో డిజైనర్ లూయీస్ రీడ్ కూడా మరింత చిన్నదైన స్విమ్ సూట్ ను రూపొందించి, దానికి ‘బికినీ’ అనే నామకరణం చేశాడట. బికినీ అటాల్ చిన్న దీవి, తాను రూపొందించిన స్విమ్ సూట్ కూడా చిన్నదేనని ఆయన ప్రచారం చేసుకున్నాడట. దీంతో అప్పటి నుంచి స్విమ్ సూట్ కు బికినీ అనే పేరే స్థిరపడిపోయింది. అసలు బికినీ అటాల్ అంటే... కొబ్బరికాయల దీవి అని అర్థమట!

More Telugu News