: ఆ ‘అంతరాయం’ మా పనేనన్న ‘లిజర్డ్ స్క్వాడ్’... అలాంటిదేమీ లేదన్న ఫేస్ బుక్!

సోషల్ నెట్ వర్క్ సైట్లు ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, వాట్స్ యాప్ తదితరాలు నిన్న మధ్యాహ్నం కొన్ని గంటల పాటు స్తంభించిన సంగతి తెలిసిందే. సదరు వెబ్ సైట్లను స్తంభింపజేసింది తామేనని ఐఎస్ ఉగ్రవాదుల మద్దతుదారుగా పేర్కొంటున్న లిజర్డ్ స్క్వాడ్ ప్రకటించింది. ఫేస్ బుక్ తో పాటు ఇన్ స్టాగ్రామ్ స్తంభనకు కూడా తామే కారణమని కూడా వారు ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. నిన్న మధ్యాహ్నం మొరాయించిన సోషల్ నెల్ వర్కింగ్ సైట్లు కొద్దిసేపటికే తిరిగి యథావిధిగా నడిచాయి. అయితే, లిజర్డ్ స్క్వాడ్ ప్రకటనను ఫేస్ బుక్ తోసిపుచ్చింది. తమ సేవల్లో కలిగిన అంతరాయంలో మూడో వ్యక్తి ప్రమేయం ఎంతమాత్రం లేదని ఫేస్ బుక్ పేర్కొంది. ఓ చిన్న మార్పు చేసిన కారణంగా తలెత్తిన సాంకేతిక లోపం నేపథ్యంలో అంతరాయం ఏర్పడిందని వెల్లడించింది. అయితే సదరు లోపాన్ని వెంటనే సరిచేశామని తెలిపింది. కాగా, లిజర్డ్ స్క్వాడ్ ఇటీవలే మలేసియా ఎయిర్ లైన్స్ వెబ్ సైటును హ్యాక్ చేసిన సంగతి తెలిసిందే.

More Telugu News