: ఒబామా పర్యటన ఆద్యంతం ఎన్ని రికార్డులో!

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పర్యటనలో భాగంగా భవిష్యత్తులో చెప్పుకునేందుకు ఎన్నో తీపి గుర్తులు మిగిలాయి. ఆయన అడుగు పెట్టినప్పటి నుంచి ఎన్నో ఘటనలు రికార్డు పుటల్లోకి ఎక్కాయి. శనివారం నాడు ఆయన పాలం విమానాశ్రయంలో దిగినప్పుడు ప్రొటోకాల్ పక్కపెట్టి ప్రధాని మోదీ స్వాగతం పలికిన సంగతి తెలిసిందే. ఒక దేశాధ్యక్షుడు ఇండియాను సందర్శించిన వేళ స్వయంగా ప్రధాని స్వాగతం చెప్పడం ఇదే తొలిసారి. ప్రొటోకాల్ ప్రకారం ఒబామాను రాష్ట్రపతి భవన్ లోనే మోదీ కలవాలి. భారత గణతంత్ర వేడుకలకు వచ్చిన తొలి అమెరికా అధ్యక్షుడు కూడా ఒబామానే. అమెరికా అధ్యక్ష హోదాలో రెండుసార్లు భారత్ ను సందర్శించింది కూడా ఆయనే. అంతే కాదు, రిపబ్లిక్ వేడుకలకు వచ్చిన ఏ దేశాధ్యక్షుడు అయినా రాష్ట్రపతి ప్రయాణించే వాహనంలో రాజ్ పథ్ చేరుకోవాలి. ఆ సంప్రదాయాన్ని పక్కనబెట్టి తన సొంత వాహనం (బీస్ట్)లో వచ్చి వెళ్లిన తొలి అతిథి బరాక్ ఒబామానే. ఇదో రికార్డు. అమెరికా సీక్రెట్ సర్వీస్ విభాగం ప్రొటోకాల్ ప్రకారం అమెరికా అధ్యక్షుడు ఆరుబయట ఒకే చోట 45 నిమిషాలకు మించి ఉండరాదు. ఈ పర్యటనలో ఒబామా ఆ నిబంధన పక్కబెట్టారు. చివరగా, ప్రధాని మోదీ మరోసారి ప్రొటోకాల్ ను కాదని ఒబామా దంపతులకు సెండాఫ్ ఇచ్చేందుకు ఎయిర్ పోర్ట్ వరకూ వెళ్లారు. అయితే, ఆయన రన్ వే వరకూ మాత్రం రాలేదు. ఇన్ని రికార్డులు నమోదు చేసిన ఒబామా పర్యటన ఆయన మనసులో ఎంతో కాలంపాటు చెరగకుండా ఉంటుందనడంలో సందేహం లేదు.

More Telugu News