: భారత యువతలోనూ అలాంటి కసినే చూస్తున్నా: ఒబామా

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత్ పర్యటన కొనసాగుతోంది. ఈ ఉదయం ఢిల్లీలోని సిరి ఫోర్ట్ ఆడిటోరియంలో 2000 మంది ప్రతినిధులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. 'బహుత్ ధన్యవాద్' అంటూ తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. తన రంగు చూసి కించపరచే విధంగా వ్యవహరించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయని తెలిపారు. ప్రపంచంలో ఎన్నో అసమానతలు ఉన్నాయని అన్నారు. అయితే, టీ అమ్ముకున్న వ్యక్తి ప్రధాని పదవిని అధిష్ఠించడం భారత్ లోనే సాధ్యమైందని అన్నారు. కిందిస్థాయి నుంచి వచ్చిన వాళ్లలో ఉన్నత స్థానానికి ఎదగాలన్న కసి ఉంటుందని, ఇప్పుడు భారత యువతలోనూ అలాంటి కసినే చూస్తున్నానని వివరించారు. భారత ప్రజలు, రైతులపై పూర్తి విశ్వాసం ఉందని తెలిపారు. కుల మతాలన్నీ ఒకే తోటలోని పుష్పాలన్న గాంధీ మాటలే అందరికీ స్ఫూర్తి కావాలని ఆకాంక్షించారు. గాంధీజీ సిద్ధాంతం ఎప్పుడూ ఆచరణీయమేనన్నారు. భిన్నత్వంలో ఏకత్వమే మన బలమని ఉద్ఘాటించారు. అంతకుముందు, స్వామి వివేకానంద అమెరికాకు యోగాను తీసుకువచ్చి మేలు చేశారని కొనియాడారు. భాషా సంస్కృతుల్లో ఇరుదేశాలకు సారూప్యత ఉందని అన్నారు. సామాజిక మాధ్యమాలతో అమెరికా, భారత్ ప్రజల బంధం బలపడిందని తెలిపారు. అమెరికా ప్రజల స్నేహ హస్తాన్ని మీకోసం తీసుకువచ్చానని పేర్కొన్నారు. ఇరుదేశాల ప్రజల అభ్యున్నతి కోసం స్నేహ హస్తాన్ని అందిస్తున్నామని వివరించారు. ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత బలపడాలని ఆకాంక్షించారు. యువతే భారత్ శక్తి అని, పర్యావరణ పరిరక్షణకు యువత ముందుకురావాలని పిలుపునిచ్చారు. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలోనూ భారత్ ముందుకెళుతోందని ఒబామా పేర్కొన్నారు. అంగారకుడు, చంద్రుడిపైకి చేరుకున్న దేశాల్లో అమెరికా, భారత్ ఉన్నాయని తెలిపారు. టెర్రరిజంపై రెండు దేశాలు పోరాటం సాగిస్తాయని ఉద్ఘాటించారు. అంతేగాకుండా, అణ్వస్త్ర రహిత ప్రపంచమే అమెరికా లక్ష్యమని స్పష్టం చేశారు. భారత్... పొరుగుదేశాలైన శ్రీలంక, మయన్మార్, దక్షిణాసియా దేశాలకు సహకరించాలని సూచించారు. భారత రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొనడం ఎంతో ఆనందం కలిగించిందని చెప్పుకొచ్చారు. అమర జవానులకు తన నివాళులని పేర్కొన్నారు. రిపబ్లిక్ డే నాడు గార్డ్ ఆఫ్ ఆనర్ కు ఓ మహిళ నాయకత్వం వహించడం గొప్ప విషయమని కితాబిచ్చారు. భారత్ లో కుటుంబాలను ఐక్యంగా ఉంచడంలో మహిళలదే కీలకపాత్ర అని తెలిపారు. మహిళల సమానత్వం కోసం అమెరికా కృషి చేస్తుందని చెప్పారు. మహిళా సాధికారత సాధ్యమైనప్పుడే ఏ దేశమైనా పురోగామి పథంలో పయనిస్తుందని అభిప్రాయపడ్డారు. భారత్ లో ప్రతిఒక్కరూ బ్యాంకు ఖాతా పొందేందుకు అమెరికా సహకరిస్తుందని తెలిపారు. భారత్ లోని రైతుల ఆదాయం పెంపొందేందుకు కూడా తోడ్పడతామని అన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్ కు శాశ్వత సభ్యత్వం దక్కేందుకు తమ పూర్తి మద్దతు ఉంటుందని ఒబామా హామీ ఇచ్చారు. భారత్ లో మౌలిక వసతుల అభివృద్ధికి సహకరించేవారిలో ముందుంటామని స్పష్టం చేశారు.

More Telugu News