: రాజయ్యకు గాలం వేస్తున్న బీజేపీ, కాంగ్రెస్!

ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి టి.రాజయ్యను బర్తరఫ్ చేసిన తరువాత తెలంగాణ ప్రభుత్వంలో నెలకొన్న అసంతృప్తిని సొమ్ము చేసుకునేందుకు విపక్షాలు తీవ్రస్థాయిలో ప్రయత్నాలు ప్రారంభించాయి. మంత్రివర్గం నుంచి ఉద్వాసనకు గురైన రాజయ్యను చేర్చుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమవంతు ప్రయత్నాలకు శ్రీకారం చుట్టాయి. అందులో భాగంగానే మంత్రివర్గం నుంచి రాజయ్యను తొలగించిన వెంటనే సీఎం వైఖరి పట్ల తీవ్రస్థాయిలో ప్రతిపక్ష నేతలు విమర్శలకు దిగుతున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులకు పెద్దపీట వేస్తామన్న సీఎం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని ప్రతిపక్షాలు ధ్వజమెత్తాయి. అవమానకరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్న రాజయ్య పార్టీని వీడాలని సన్నిహితులతో పాటు ఆయన సామాజికవర్గానికి చెందిన నేతలు ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. అయితే, ఇతర పార్టీల పరిస్థితి ప్రస్తుతం అంత ఆశాజనకంగా లేదనే అభిప్రాయంతో వున్న ఆయన కొంతకాలం పాటు వేచి చూడవచ్చని తెలుస్తోంది. కేంద్రంలో అధికారంలో కొనసాగుతున్నందున బీజేపీ వైపు ఆయన మొగ్గు చూపవచ్చని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు.

More Telugu News