ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

"ఉద్యమాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తున్నాం" -ఎన్.శంకర్

Mon, Jan 31, 2011
       

         తను ఏ సినిమా తీసినా అందులో ఏదో ఒక రూపంలో ఉద్యమం వుంటుంది. ఆ పోరుబాటను వీడి తను సినిమా తీయడు. అందులోనే మానవ సంబంధాలకు కూడా పెద్దపీట వేస్తాడు. ఆయనే దర్శకుడు ఎన్.శంకర్! తన తొలి చిత్రం 'ఎన్ కౌంటర్'  నుంచీ నేటి 'జై బోలో తెలంగాణా' వరకు ఆయన రూపొందించిన అన్ని సినిమాలలోనూ ఆ కమిట్ మెంటే కనిపిస్తుంది. ఇప్పుడీ 'జై బోలో తెలంగాణా' ఫిబ్రవరి 4 న విడుదలవుతోంది. ఈ నేపధ్యంలో ఈ దర్శకుడితో జరిపిన ఇంటర్వ్యు....



"సెన్సార్ కటింగ్స్ వల్ల కథ నడకకు ఏదైనా ఇబ్బంది ఉందా?"

"ఎటువంటి ఇబ్బందీ రాదు. సెన్సార్ వాళ్లు కొన్ని సీన్స్ పట్ల తమ అబ్జక్షన్స్  చెప్పారు. నేను వాటిని క్లారిఫై చేసాను. అలాగే మరికొన్ని సీన్స్ తొలగించమన్నారు. అవి తీసేసినా కధకు వచ్చే నష్టం ఏమీ లేదు. ఈ సినిమా నుంచి మేం ఆశించిన ప్రయోజనానికి ఆ సీన్స్ వల్ల ఇబ్బంది రాదు. అందుకే మేం కూడా ఒప్పుకున్నాం"

"ఇలా చివర్లో సెన్సార్ మిమ్మల్ని టెన్షన్ పెట్టినట్టుంది?"

"అవును. కాస్త టెన్షన్ పడ్డాం. ఎందుకంటే, ఒక ప్రయోజనాన్ని ఆశించి తీసిన చిత్రమిది. అయితే, మొత్తం తెలంగాణా ప్రజానీకం మాకు అండగా నిలిచింది. అందుకే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాగలుగుతోంది. ఇది ప్రజల విజయమే!"

"ఈ సినిమా ద్వారా మీరేం చెప్పదలచుకున్నారు?"

"ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచీ ఈ గడ్డపై జరుగుతున్న ఉద్యమాన్ని కథారూపంలో ప్రజల ముందుంచుతున్నాం. 1948 నుంచి 2009 వరకు జరిగిన పోరాటం ఇందులో పది శాతముంటే, 2009 నుంచి నేటివరకు జరుగుతున్న పోరాటం మిగతా భాగానిది. దీనిని ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తున్నాం. తెలంగాణా సంస్కృతీ, సంప్రదాయాలూ... అన్నీ వుంటాయి. అలాగే ఫేమిలీ, ఆ బంధాలు, ప్రేమ, త్యాగం, పోరు... అన్నీ వుంటాయి. సామాజిక బాధ్యతతో కూడిన ఉద్యమ నేపధ్యం వుంటుంది"

"జగపతిబాబు పాత్ర ఏమిటి?"

"ఒక ఉద్యమ వీరుని పాత్ర. పోరాటంలో అమరుడయ్యే త్యాగశీలి. ఆ పాత్ర పేరు బందగి గోపన్న. తెలంగాణా పోరాటానికి చిహ్నంగా ఓ తండ్రి కొడుక్కి పెట్టుకున్న పేరది. ఈ పేరులో రెండు మతాల వారికీ చెందిన వ్యక్తులున్నారు. బందగి అంటే ముస్లిం, గోపన్న అంటే హిందువు. అంటే, తెలంగాణా పోరాటం కులమతాలకు అతీతమైనది. ఆ విషయాన్నే జగపతి బాబు పాత్ర ద్వారా చెప్పడం జరిగింది"

"టీఆర్ ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఇందులో ఓ పాట రాసారు కదా, దానికి ఏదైనా ఇన్స్ పిరేషన్ ఉందా?"

"కేసీఆర్ స్వతహాగా మంచి రచయిత. ఆయన కవిత్వం, పాటలూ రాస్తుంటారు. ఆమధ్య ధూమ్..ధాం ప్రోగ్రాం లో ఆయన రాసిన పాటలు విన్నాక ఓ పాట రాయించుకోవాలన్న ఆలోచన వచ్చింది. అడిగిన వెంటనే చక్కని పాట రాసారు. 'గారడి చేస్తుండ్రు... గడబిడ చేస్తుండ్రు...' అంటూ సాగే ఈ పాట ఎంతో పాప్యులర్ అయింది"

"చివరిగా... తెలంగాణా అంశంతో రూపొందిన ఈ చిత్రం రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల వారికి నచ్చుతుందంటారా?"

"కచ్చితంగా నచ్చుతుంది. ఎందుకంటే, ఇది ఎవరినీ గాయపరిచే విధంగానూ, బాధపెట్టే విధంగానూ మాత్రం వుండదు. ప్రజలను మభ్యపెట్టి, పబ్బం గడుపుకునే నాయకులే ఇందులో విలన్లుగా కనిపిస్తారు. ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి. అన్ని ప్రాంతాల వారూ దీనిని ఆదరిస్తారు" 

 
X

Feedback Form

Your IP address: 54.158.119.60
Movie News (Latest)