ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

గణేష్ 'పాత్రో'చిత సంభాషణలు!

Mon, Jan 05, 2015
గణేష్ పాత్రో
గణేష్ పాత్రో
"ఇంతకాలం... మనం విడిపోయింది... మృత్యువు ఒళ్లో కలవడానికా?"

ఈ ఒక్క డైలాగు చాలు ... 'మరో చరిత్ర' గురించి చెప్పుకోవడానికి!

స్వప్న 'అత్యా'చారానికి గురై... బాలు 'హత్యా'చారానికి గురై, ఒకరి ఒడిలో మరొకరు కన్నుమూసే 'మరోచరిత్ర' క్లైమాక్స్ దృశ్యంలో ఆ చివరి డైలాగు ప్రేక్షకులను కన్నీరు పెట్టిస్తుంది, గుండె పిండేస్తుంది. బరువెక్కిన హృదయంతో ధియేటర్ నుంచి ఇంటికి పంపిస్తుంది. ఆ డైలాగే నాలుగైదు రోజుల పాటు మనల్ని వేదనతో వెంటాడుతుంది.

గణేష్ పాత్రో 'పెన్ను' పవరది! క్షణకాలం మురిపించే 'పంచ్' డైలాగులకన్నా, కలకాలం గుర్తుండే 'మంచ్' డైలాగులతో తనదైన ముద్ర వేసిన రచయిత ఆయన.

తను నాటకాల నుంచి వచ్చాడు. అందుకే, డైలాగు లోతు తెలుసు. ఎక్కడ ఏ మాట వదలాలో, ఎక్కడ మాట కట్ చేయాలో, ఎక్కడ మాటను కట్టి పారేయాలో ఆయనకు బాగా తెలుసు.

'కొడుకు పుట్టాలా', 'పావలా' నాటకాలతో అప్పటికే ధియేటర్ని కుమ్మేశాడు. స్టేజ్ పైనే కాకుండా ఆల్ ఇండియా రేడియోలో కూడా ఆ నాటకాలు విశేష ఆదరణ పొందాయి. విశాఖ 'పల్లె'కారుల మాండలికం రాయాలన్నా, గోదావరి యాస పలికించాలన్నా గణేష్ 'పాత్రో'చిత్రంగా రాస్తాడు.

చేయితిరిగిన వాడు కాబట్టే బాలచందర్ అంతటి దర్శకుడితో అనుబంధం ఏర్పడింది.
'మరోచరిత్ర' సృష్టించడంతో ప్రారంభమైన వారి ప్రయాణం 'రుద్రవీణ' పలికించే వరకు అప్రతిహతంగా కొనసాగింది.

బాలచందర్ కి ఎలాంటి మాటలు కావాలో పాత్రోకి తెలుసు. ఆయా పాత్రలకి పాత్రో ఎలా రాస్తాడో బాలచందర్ కీ తెలుసు. అందుకే, ఎక్కడా ఒక్క మాట కూడా ఎగస్ట్రా అనిపించుకోలేదు.
'గుప్పెడు మనసు', 'ఇది కథ కాదు', 'రుద్రవీణ'... ఎక్కడా దృశ్యాన్ని మాటలు డామినేట్ చేయవు. మాటల్ని దృశ్యం డామినేట్ చేయదు. అది బాలచందర్ -పాత్రోల మాట బంధం!

బాలచందర్ లానే క్రాంతికుమార్ కి కూడా పాత్రో మాటల విలువ తెలుసు. అందుకే, 'సీతారామయ్యగారి మనవరాలు' బాధ్యత ఆయనకే అప్పజెప్పాడు. తాత-మనవరాలు మధ్య ఆర్ధ్రత నిండిన సంభాషణలు రాసి మాట దక్కించుకున్నాడు.

మధ్యలో మాటలే కాదు పాటలు కూడా రాశాడు.

'హలో గురూ ... ప్రేమ కోసమేనోయ్ జీవితం... మగాడితో ఆడదానికేలా పౌరుషం' అంటూ అమ్మాయి వెంట పడే అబ్బాయి భావాలను చిలిపిగా, రసాత్మకంగా ఒలికించాడు.
'నిర్ణయం' సినిమా కోసం రాసిన ఈ పాట అప్పట్లో కుర్రాళ్ళని ఊపేసింది. సూపర్ హిట్టే!

కాలం మారిపోయింది. కొత్త దర్శకులకు తగ్గట్టుగా కొత్త రచయితలూ వచ్చేశారు. అందరూ పాత్రోని మరచిపోయారనుకుంటున్న సమయంలో శ్రీకాంత్ అడ్డాల మాత్రం 'సారీ, నేను మరచిపోలేదు' అంటూ ఇంకిపోయిన పాత్రో పెన్నులో మళ్లీ ఇంకు పోశాడు. పాత్రో ప్రతిభ ఆయనకు తెలుసు. అందుకే 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'కి మీరే రాయాలంటూ వెళ్లి అద్భుతమైన మాటలు రాయించుకున్నాడు. మళ్లీ మన మట్టివాసన, మల్లెల వాసన గుబాళింపజేశాడు.

పాత్రో సినిమా లిమ్మని ఎప్పుడూ ఎవర్నీ అడగలేదు. తనకోసం వచ్చే వారిని నిరుత్సాహపరచలేదు.

ప్రేమలు ... ఆప్యాయతలు ... బంధాలు ... సున్నితత్వాలు ... మట్టివాసన కావాలనుకునేవాళ్ళు ఆయన చేతే రాయించుకునేవారు.

ఆయన మాటలు ఎలా అయితే సాఫ్ట్ గా ఉంటాయో ... మనిషిలో కూడా అదే సాఫ్ట్ నెస్.
ఈయన రాసిన సినిమాల్లోనే కాకుండా, నిజ జీవితం క్లైమాక్స్ లో కూడా ఓ విచిత్రం జరిగింది. బాలచందర్ వెళ్లిపోయిన కొన్ని రోజులకే ఈయనా సెలవంటూ వెళ్ళిపోయాడు. ఇది నిజంగా మరోచరిత్రే!
X

Feedback Form

Your IP address: 54.166.48.3
Movie News (Latest)