దైవానుగ్రహం

మానవులు ఎంతటి శక్తిమంతులైనా...ఎంతటి స్థితిమంతులైనా వాళ్లు తలపెట్టే కార్యాలకు దైవానుగ్రహం తప్పనిసరిగా వుండాలి. పురాణాలను ... ఇతిహాసాలను పరిశీలిస్తే, ఎవరు ఏం సాధించినా అది దైవానుగ్రహంతోనేననే విషయం స్పష్టంగా తెలుస్తుంది. కండబలం ... బుద్ధిబలం వుంటే దేవుడితో గానీ, ఆయన దయతోగాని పనిలేదని విర్రవీగిన వారు భంగపడిన సందర్భాలు కనిపిస్తాయి. వారికి ఆ తెలివితేటలను ... శక్తి సామర్థ్యాలను ప్రసాదించినది కూడా తానేననే విషయం భగవంతుడు తెలియజేసి వాళ్ల కళ్ళు తెరిపించాడు.

ఇంద్రాది దేవతలు సైతం కొన్ని సందర్భాల్లో విష్ణుమూర్తి అనుగ్రహాన్ని ... మరికొన్ని సందర్భాల్లో శివుడి అనుగ్రహాన్ని కోరుతూ తమ కార్యకలాపాలను కొనసాగించిన తీరు, దైవానుగ్రహం యొక్క గొప్పతనాన్ని ఆవిష్కరిస్తుంది. మహాశక్తిమంతుడిగా మానవవీరులు ... వానరవీరులు ... దేవతలచే ప్రశంసలు అందుకున్న హనుమంతుడు కూడా తన శక్తి కన్నా దైవానుగ్రహమే గొప్పదని భావించాడు.

వాయుపుత్రుడైన హనుమంతుడికి ఆకాశ మార్గాన ప్రయాణించడం వెన్నతోబెట్టిన విద్య. సాక్షాత్తు సూర్యభగవానుడే ఆయనకి గురువు. మహాజ్ఞాన సంపన్నుడు ... పరాక్రమవంతుడు అయినప్పటికీ సీతమ్మ వారి జాడ తెలుసుకు రావడం తనకి చాలా తేలికైన విషయమని ఆయన అనుకోలేదు. సముద్రాన్ని లంఘించే ముందు ఆయన బ్రహ్మ దేవుడిని ... వాయు దేవుడిని ... వరుణ దేవుడిని ... ఇంద్రుడిని ... సాక్షాత్తు శ్రీమన్నారాయణ స్వరూపమైన శ్రీరామచంద్రుడిని పూజించాడు.

శ్రీరామచంద్రుడి ఆదేశం మేరకు సీతమ్మవారి జాడ కనుక్కునేందుకు తాను చేస్తోన్న ప్రయత్నానికి సహకరించమనీ, ఈ విషయంలో విజయం చేకూరేలా అనుగ్రహించమని కోరాడు. ఇలా మహాబల సంపన్నుడైన హనుమంతుడు, భగవంతుడి అనుగ్రహంతోనే ఏదైనా సాధించడం సాధ్యమవుతుందని ఈ లోకానికి చాటిచెప్పాడు.


More Bhakti News